
లండన్: ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టు వద్ద భారతీయ నావికులున్న వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు సురక్షితంగా బయటపడగా, మరో ఇద్దరి జాడ గల్లంతైనట్టు కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఆదివారంనాడు తెలిపింది. నల్ల సముద్రంలోని ఒడెసా ఓడరేవు వద్ద ‘ఎంవీ ఏజీఎన్ రాగ్నర్’ వాణిజ్య నౌకపై శనివారం ఈ దాడి జరిగినట్టు వెల్లడించింది.
ఘటన జరిగిన సమయంలో నలుగురు భారతీయులు ఆ నౌకలో ఉన్నారని, ఇద్దరు సురక్షితంగా ఉన్నారని, గల్లంతైన ఇద్దరు భారతీయుల కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఉక్రెయిన్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని వివరించింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లోని కీలక బ్లాక్ సీ పోర్ట్ తరచు దాడులకు గురవుతోంది.











