మన తెలంగాణ/అబ్దుల్లాపూర్‌మెట్/మఠంపల్లి: నగర శివారు పెద్ద అంబర్‌పేట్‌లో నకిలీ ఎరువుల తయారీ కేంద్రం గుట్టురట్టు చేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో వెలుగుచూసిన ఈ నకిలీ ఎరువుల వ్యవహారం అక్కడి పోలీసులు కూపీ లాగితే రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ తయారీ కేంద్రం డొంక కదిలింది. హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు కథనం ప్రకారం.. సూ ర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో విచ్చలవిడిగా నకిలీ గ్రోమా ర్ డీఏపీ, ఇతర ఎరువులను విక్రయించారు. వాటిని కొనుగోలు చేసిన ఓ రైతుకు అనుమానం రావడంతో గ్రోమోర్ కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. దాంతో సం స్థ ప్రతినిధులకు అనుమానం వచ్చి డీఏపిలోని ఎరువును, బ్యాగును పరిశీలించగా అనుమానం వచ్చి వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. తదనంతరం వారు సదరు డీఏపీ బ్యాగులోని శాంపిల్స్‌ను సేకరించి పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం నకిలీ ఎరువుగా గుర్తించారు. అనంతరం వ్యవసాయాధికారి శ్రీనివాస్ మఠంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రంగంలోకి దిగి రైతుకు గ్రోమార్ ఎరువు అమ్మినవారిని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు.

విచారణలో హైదరాబాద్ శివారులో సరఫరా కేంద్రం ఉందనే సమాచారంతో హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు, మఠంపల్లి ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో పాటు వ్యవసాయాధికారి శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారులు పెద్ద అంబర్‌పేట్ హరితహారం కాలనీలో ఎరువుల తయారీ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఓ కోళ్ల ఫారంను అద్దెకు తీసుకొని గత రెండు నెలలుగా ఈ నకిలీ ఎరువుల దందాను నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను ముందే పసిగట్టి నకిలీ ఎరువుల ముఠా పరారైంది. నకిలీ ఎరువుల తయారీ కేంద్రంలో నివ్వెరపోయే విషయాలు వెలుగుచూశాయి. గోదాంలో పెద్ద సంఖ్యలో ఉప్పు బ్యాగులు లభించాయి. సొంతంగా గ్రోమోర్, ఇతర కంపెనీల పేరుతో బ్యాగులు తయారీ మిషన్‌తో పాటు సాధారణ ఉప్పులో ఎరుపు రంగు కలిపి ఓ యాంత్రంలో వేసి మిక్సింగ్ చేసి ఫౌడర్‌గా చేస్తున్నారు. అనంతరం ఎరువులుగా తయారీచేసి వివిధ కంపెనీల పేరుతో ముద్రించిన బ్యాగులో నింపి తమ ముఠా సభ్యులతో రైతులకు సరఫరా చేస్తున్నారు. ఈ నకిలీ ఎరువుల తయారీ గుట్టుగా నిర్వహిస్తూ రైతులకు చేరవేసి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

2 కోట్ల ఎరువులు, యంత్రాలు గోదాం సీజ్

గోదాంలో వివిధ బ్రాండెడ్ ఎరువుల కంపెనీలతో తయారుచేసి ఉన్న ఎరువుల బ్యాగులను పోలీసులు గుర్తించారు. భారీ యంత్రాలు, ఖాళీ సంచులు గోదాంలో లభ్యమయ్యాయి. దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే బ్రాండెడ్ ఎరువు బ్యాగులను, యంత్రాలను, ఖాళీ సంచులతో పాటు గోదాంను శనివారం సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్ మండల వ్యవసాయాధికారిణి పల్లవి సమక్షంలో సీజ్ చేశారు. ఈ మాఫీయా వెనుక ఉన్న అసలు సూత్రదారులు ఎవరనే కోణంలో విచారణ నిర్వహించి త్వరలోని నకిలీ ఎరువుల తయారీ ముఠాను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.