జెన్‌జెడ్ యువత ఉద్యమం ఇప్పుడు ప్రభుత్వాన్నే కాదు, ప్రతిపక్షాలకు కూడా సవాలుగా మారింది. ఏ ఒక్క రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే ఉద్యమం కాదు ఇది. వీరంతా పరిస్థితుల బట్టి, సమస్యల తీవ్రత బట్టి తమ ఓట్ల శక్తిని మార్చుకునే ‘ఫ్లోటింగ్ ఓటర్లు’. అందువల్ల 2029 ఎన్నికల్లో వీరి ఓటు నిర్ణయం కీలక పాత్ర వహించే అవకాశం కనిపిస్తోంది. నీట్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీపై ఉధృతంగా సాగిన వీరి నిరసనలతో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ తరువాత వీరి డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడం తదితర పరిణామాల ఫలితంగా వీరి నిరసనలు ముగిసినా, వీరి అసలు ప్రభావం రానున్న ఎన్నికల్లో తెలుస్తుంది. ఈ ఉద్యమం చాలా మంది యువ ఓటర్లను చైతన్యపర్చింది. ఎన్నికల్లో వీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక ప్రతిపక్షాల సంగతి పరిశీలిస్తే కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలను వారు ప్రభుత్వంపై పెల్లుబికిన అసంతృప్తిగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రజాగ్రహాన్ని రానున్న ఎన్నికల్లో తమకు ఓటుబ్యాంకుగా మార్చుకోవచ్చని ఆశపడుతున్నారు.

వీరి అంచనా తప్పు కాకపోయినా అది అసంపూర్తి అని చెప్పవచ్చు. ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉండవచ్చు. కానీ అదే సమయంలో ప్రతిపక్షంపై కూడా ప్రజలకు పూర్తి నమ్మకం ఉందా? అన్నదే ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజావ్యతిరేకత రాజకీయంగా రూపాంతరం ఎలా చెందుతుందో నిర్ణయించేది ప్రతిపక్షం చూపించే ప్రత్యామ్నాయం, విశ్వసనీయత, నాయకత్వం, స్పష్టమైన కార్యాచరణే. నిజానికి ఒక నాయకుడు అంటూ లేకుండా, స్పష్టమైన సంస్థాగత నిర్మాణం లేకుండా, ప్రతిపక్షాలన్నింటి కంటే ముందుగా ప్రజాగ్రహాన్ని అందిపుచ్చుకుని కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది. మరి ప్రధాన విపక్షాలు ఏం చేయగలిగాయి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నిరసనలను సమీకరించి రాజకీయ సమీకరణాన్ని పూర్తిగా గేమ్‌ఛేంజర్‌గా వ్యూహాన్ని కాక్రోచ్ జనతా పార్టీ రూపొందించగలిగింది.

మరి విపక్షం ఇలాంటి వ్యూహాన్ని రూపొందించగలదా? లేక సంప్రదాయ రాజకీయాలకే పరిమితమైపోతుందా? అలాగని ప్రతిపక్షాలు విజయాలు సాధించలేదని అనలేం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి మొత్తం 80 స్థానాల్లో 43 స్థానాలను గెలుచుకుని రికార్డు సాధించింది. బిజెపి ‘అబ్ కి బార్ 400 పార్’ అన్న నినాదంతో ముందుకు వెళ్లగా, ఆ విధంగా 400 సీట్లు బిజెపికి వస్తే రాజ్యాంగాన్ని మార్చి వేస్తుందని ఇండియా కూటమి విస్తృతంగా ప్రచారం సాగించి ప్రజల్లో బిజెపిపై అపనమ్మకాన్ని పెంచి గెలుపు సాధించింది. అయితే 2029 ఎన్నికల నాటికి పరిస్థితి ఇలా ఉండదు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జెన్‌జెడ్ యువతను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను కొత్తగా తెరపైకి తెస్తున్నారు.

లోక్‌సభలోని మొత్తం 543 స్థానాలను 850 వరకు పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుతోపాటు లోక్‌సభ స్థానాల్లో మూడోవంతు సీట్లను వారికే కేటాయించడానికి యోచిస్తున్నారు. 2011 జనాభా ప్రకారం నియోజకవర్గాలను పునర్విభజన చేస్తున్నారు. ఈ ప్రణాళిక అమలైతే 2029 ఎన్నికలకు ముందే భారత పార్లమెంటరీ వ్యవస్థలో దశాబ్దాల తర్వాత అతిపెద్ద మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఇప్పుడు గెలుచుకోవలసిన కీలక వర్గం జెన్‌జీ యువ ఓటర్లే. వీరు ఏ పార్టీకి శాశ్వతంగా కట్టుబడని ఓటర్లు అన్నసంగతి తెలిసిందే. భారతీయ కుటుంబాలు సంప్రదాయంగా ఒకే విధమైన రాజకీయ అభిప్రాయాలను కలిగి ఉండగా, జెన్‌జీ ఓటర్లు అభిప్రాయాలు మాత్రం వారికి భిన్నంగా ఉంటున్నాయి. వీరు సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్ ఫారాలు, ఇంటర్నెట్, ఇన్‌స్టాగ్రామ్‌ల వంటి సమాచార సాధనాలతో మమేకం అవుతున్నారు.

అందువల్ల తమ తల్లిదండ్రుల అభిప్రాయాలకు దూరంగా ఆలోచిస్తున్నారు. 2029 నాటికి దేశంలో జెనరేషన్ జెడ్ అతిపెద్ద ఓటరు వర్గంగా మారుతుంది. అప్పటివరకు మిలీనియన్స్‌ను అధిగమించి అత్యంత శక్తివంతమైన వర్గంగా జెన్‌జీ నిలుస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే 2029లో సుమారు 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు భారత యువత తొలిసారిగా ఓటు వేయబోతున్నారు. ఈ కొత్త ఓటర్ల వర్గం అనేక దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువే. ఈ యువత ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా లేదు. ఉద్యోగ సమస్యలు, పరీక్షల్లో అవకతవకలు, కృత్రిమ మేధ వ్యాప్తితో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం, తదితర సమస్యలు వీరిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

అందుకనే ఏ రాజకీయ పార్టీ వచ్చినా తమ బతుకులింతే అన్న అసంతృప్తి వీరిలో నాటుకుపోయింది. జెన్‌జీ యువతలో కొందరు తమ ఉద్యమంతో ప్రభుత్వం దిగివచ్చి కేంద్ర విద్యామంత్రిని రాజీనామా చేయించిందని, మిగతా డిమాండ్లకు సానుకూలంగా స్పందించిందని, అందుకని తమ సమస్యలను పరిష్కరించగలదన్న ఆశతో ఉండగా మరికొందరు జంతర్ మంతర్‌లో నిరసనల సమయంలో, పార్లమెంట్ మార్చ్‌లో పోలీసులు తమపై సాగించిన దారుణ దమనకాండను గుర్తు తెచ్చుకుంటున్నారు. మేకులు తాపిన లాఠీలతో చితక బాదారని, బాష్పవాయు ప్రయోగించారని, ఇంటర్నెట్ నిలిపివేశారని, ఏమాత్రం విశ్వసత లేని ప్రచారాలు సాగించారని మండిపడుతున్నారు. మరికొంతమంది రాజకీయ నాయకులు అవకాశవాద వైఖరిని అసహ్యించుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కనిపించి, పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు అదృశ్యమైన ఊసరవెల్లి నాయకుల తీరును ఎండగడుతున్నారు. ఈ చేదు అనుభవాలతో యువత ఎవరికి ఓటు వేయడానికి మొగ్గు చూపుతారో చెప్పలేం.