మన తెలంగాణ/హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ద్వితీయ భాగం(ఆగస్టు, సెప్టెంబర్)లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తాజాగా విడుదల చేసిన ముందస్తు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు ద్వితీయార్ధానికి చెందిన వాతావరణ నివేదికను శనివారం భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కూడా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం సాధారణ స్థాయి కంటే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, జలాశయాలు, ప్రాజెక్టులు గణనీయంగా నిండాయి. అయితే ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగకపోవచ్చని, రాబోయే రెండు నెలల్లో వర్షాల తీవ్రత తగ్గే అవకాశమున్నందున ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిని సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించింది. జాతీయ అంచనాల ప్రకారం ఆగస్టు, -సెప్టెంబర్ కాలంలో దేశవ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాల సగటు (ఎల్‌పిఏ) కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంచనాలు చెబుతున్నాయి.

బలపడుతున్న ఎల్‌నినో

ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఓ మోస్తరు ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతున్నాయని, నైరుతి రుతుపవనాల మిగిలిన కాలంలో ఇవి మరింత బలపడే అవకాశముందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, పశ్చిమ ప్రాంతాలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది.

అయితే ఆగస్టు నెలలో మాత్రం ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే కొంత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో వర్షాలు తగ్గే అవకాశం ఉందని అంచనా వెల్లడించింది. వర్షాల తగ్గుదలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయి కంటే అధికంగా ఉండవచ్చని పేర్కొంది. దీంతో ఆగస్టు నెలలో ఉక్కపోత, వేడి వాతావరణం పెరిగే అవకాశముందని తెలిపింది.