
పదవిలో ఉన్న పెద్దమనుషులంతా
బహు జాగ్రత్తగా కట్టుకున్న అబద్ధాల
అద్దాల భవంతి భళ్ళున బద్దలయింది
ఒకొక్కటిగా పేర్చుకుంటూ వచ్చిన
పరువు ప్రతిష్టల పేక మేడ
బొద్దింకల పద ఘట్టనకు కుప్ప కూలిపోయింది
విద్యార్థులు ఇచ్చిన షాక్ ట్రీట్ మెంట్ కి
విశ్వగురువు పెద్దరికం మంట కలిసిపోయింది
దేశ దేశాలు తిరిగి, భుజాలు తట్టి
ఆలింగనాలు చేసుకుని, చాక్లెట్లు పంచి
మూట కట్టుకున్న మంచి పేరంతా
నిరసనల ప్రవాహంలో పడి
నీటిలో పడ్డ ఉప్పుమూటలా కరిగిపోయింది
వ్యక్తిగత విజయాల వేటలో
డబ్బు పోగేసే ఆటలో
మునిగి తేలుతున్న పెద్దవాళ్ళకి
అవినీతి, అధికార దుర్వినియోగం
అత్యంత సహజమై పోయిన నాయకులకీ
మేము కోరుకున్న రేపు, ఇది కాదని చెప్తున్న
నవ యువత గొంతులో మరలా వినిపిస్తోంది
మనమంతా మర్చిపోయిన
సమసమాజపు వేకువ రాగం
-సింగరాజు రమాదేవి








