మన తెలంగాణ/హైదరాబాద్: గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై విచారణకు సంబంధించిన కమిషన్ నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కు అప్పగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జస్టిస్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక, న్యాయనిపుణులు సలహాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రెవెన్యూ, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మం త్రివర్గ భేటీ అనంతరం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ అక్రమాలకు సం బంధించి అంతరాష్ట్ర వ్యవహారాలతో పాటు కేం ద్రసంస్థల ప్రమేయం ఉండడంతో మరింత నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలన్న ఉద్ధేశ్యంతోనే ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించిందని ఆయన తెలిపారు.'


2024 మార్చి 14న కమిషన్ ఏర్పాటు

విద్యుత్ కొనుగోళ్లతో పాటు భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్లలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పా టు చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. 2024 మార్చి 14వ తేదీన కమిషన్ ప్రకారం రిటై ర్డ్ జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసిందని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేర కు 2024 జులైలో ఆయన విచారణ నుంచి తప్పుకోవటంతో జస్టిస్ మదన్ బి.లోకూర్‌ను కమిషన్‌గా నియమించినట్టు ఆయన తెలిపారు. 2024 అక్టోబర్‌లో కమిషన్ మొత్తం 114 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని, అనంతరం 2025 జనవరి 4వ తేదీన జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నివేదికపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించిందని ఆయన తెలిపారు.

ఈ నివేదికను పరిశీలించిన అడ్వకేట్ జనరల్ తన సూచనలు, అభిప్రాయాలను తెలియజేశారని, వాటిపై ఈ రోజు కేబినేట్ చర్చించిందని, ప్రధానంగా అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ రం గ సంస్థలు ఈ కేసులో ఉన్నాయని, అందుకే ని ష్పాక్షిక దర్యాప్తు జరిపేందుకు సిబిఐ విచారణ అ ప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆ యన తెలిపారు. ఇందుకు సంబంధించిన తదుప రి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు కేబినెట్ ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈనెలాఖరులోగా భూముల విలువలను పెంచాలని కేబినెట్ ఆమోదించిందని మం త్రి పొంగులేటి తెలిపారు. ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యయన్ సూచన మేరకు భూముల విలువను పెంచాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఈ భూముల విలువను ఈనెల 26వ తేదీలోగా సైంటిఫిక్‌గా పెంచాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.


ఇరిగేషన్, రోడ్లుకు సంబంధించి భూములను సేకరించేటప్పుడు మార్కెట్ వాల్యూ తక్కువ ఉండడంతో తమకు అన్యాయం జరుగుతుందని రైతులు, ప్రజలు చేసిన విజ్ఞప్తి మేరకు మార్కెట్ వాల్యూను పెంచాలని కేబినెట్‌లో నిర్ణయించామని ఆయన అన్నారు. రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. మార్కెట్ విలువల రేషనలైజేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే పరిహారం రేట్లపై అసంతృప్తితో ఉండడం, ధర పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతి అనుసరించి ఈ ధరలను సవరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. జిల్లాల్లో ఉండే మార్కెట్ విలువల రివిజన్ కమిటీలు అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని విలువలను సవరిస్తుందని ఆయన తెలిపారు.

హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకునే వారికి పది శాతం చెల్లించే వెసులుబాటు

హిల్ట్ పాలసీకి సంబంధించిన అంశాలను కూడా కేబినెట్‌లో చర్చించామని ఆయన తెలిపారు. హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా పది శాతం చెల్లించే వెసులుబాటు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, వారికి ఇప్పుడున్న భూముల ధరలే వర్తిస్తాయని, మిగతా 90 శాతం 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని...

అకాల వర్షాలతో వివిధ జిల్లాల్లో పంటలు, పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లడంతో వెంటనే ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు బాధ్యత తీసుకుని వివరాలు తెప్పించుకుని రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నల్గొండ, -రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు అప్పగించే ఎంఓయూకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి తెలిపారు. దీంతో నల్గొండ- రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ( నార్మ్) కు సంబంధించిన పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి డైరీ ప్లాంట్ నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఎన్డీడిబి నిర్వహిస్తోందన్నారు.

9 జిల్లాలో సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్లు....

రాష్ట్రంలోని 9 జిల్లాలో 33/11 కెవి సబ్‌స్టేషన్‌ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. పైలెట్ పద్ధతిన 18 చోట్ల సోలార్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ.66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు

రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు (అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్లు), పాలిటెక్నిక్ కాలేజీలు, టీ శాట్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో వన్‌టైమ్ సెటిల్‌మెంట్....

క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లలో పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పన్నులను క్లియర్ చేసేందుకు వన్‌టైమ్ సెటిల్ మెంట్ వెసులుబాటును కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 5,864 కోట్ల బకాయిలుండగా, జరిమానాలు, వడ్డీలన్నీ మినహాస్తే రూ.1,686 కోట్లు వస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోనే వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద ఈ బకాయిలు వసూలు చేసుకోవాలని మున్సిపల్ శాఖను కేబినెట్ ఆదేశించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. హైదరాబాద్ జల మండలికి ఇవ్వాల్సిన నీటి బకాయిలను కూడా సర్దుబాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.

అజీజ్‌నగర్‌లో అధునాతన కూరగాయల మార్కెట్

ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్ ఫ్లడ్ ఫ్లో కాలువ నిర్మాణానికి ఆమోదం తెలిపిందని, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరు అందించనున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో అధునాతన కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు 42 ఎకరాల భూమిని ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.