
శ్రీహరికోట: భారత అంతరిక్ష రంగ చరిత్రలో నూతన శకం ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్‌టెక్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ‘విక్రమ్-1’ ఆర్బిటాల్ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. శనివారంనాడు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి మ ధ్యాహ్నం 12:05 గంటలకు చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. తొలుత ఉదయం 11.30గంటలకు చేపట్టాల్సిన ఈ ప్రయోగం సాంకేతికలోపం కారణంగా 35నిమిషాలపాటు ఆలస్యమైంది. శాస్త్రవేత్తలు ఇంధన వ్యవస్థలో లోపాన్ని గుర్తించి సరిచేశారు. సుమారు 20 నిమిషాల తర్వాత రాకెట్ నిర్దిష్ట కక్షలోకి చేరింది. అనంతరం ‘హల్ స్పేస్.. విక్రమ్1 వచ్చేసింది’ అని స్కైరూట్ ఎక్స్‌లో పోస్టు చేసిన ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించింది. మిషన్ ఆగమన్ పేరిట స్కైరూట్ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఆర్బిటాల్ ప్రయోగాల యుగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ మిషన్‌కు ఆ పేరు పెట్టింది.
అంతరిక్షంలోకి ఏమేం మోసుకెళ్లింది..
విక్రమ్-1 ద్వారా గ్రహాస్పేస్, కాస్మోసెర్వ్, డీక్యూబ్‌డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ పేలోడ్‌లు సహా స్కైరూట్‌కు చెందిన ‘స్కోప్’ను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్‌లోని ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ వ్యవస్థల పనితీరును అంతరిక్ష ప్రయాణంలో పరీక్షించి కీలక సమాచారం రాబట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వహస్తాలతో ‘వందేమాతరం’ అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్‌కార్డును కూడా అంతరిక్షంలోకి విక్రమ్1 తీసుకెళ్లింది. వీటితో పాటు కాస్మోస్ డైమండ్స్ సంస్థ రూపొందించిన కాస్మిక్ బ్లూమ్ ఆర్ట్‌వర్క్, 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన విక్రమ్-1 రాకెట్ సూక్ష్మప్రతిరూపాన్నీ నింగిలోకి పంపారు. దీనిపై సర్ సివి రామన్, విక్రమ్ సారాభాయ్, ఎపిజె అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల రూపాలున్నాయి. అంతేకాకుండా ఈ ప్రయోగం విజయవంతం కావాలని కాంక్షిస్తూ స్కైరూట్ టీమ్ సహా ఇస్రో మాజీ ఛైర్మన్లు,
శాస్త్రవేత్తలు, భారతీయ వ్యోమగాములు, ఇతరులు పంపిన డజన్ల కొద్దీ చేతిరాత పోస్ట్‌కార్డులనూ ప్రత్యేక పేలోడ్ బాక్స్‌లో భద్రపరిచారు. రానున్న కాలంలో వాణిజ్య ప్రయోగాల అవసరాలకు సాంకేతిక సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా స్కైరూట్ పనిచేస్తోంది. విక్రమ్1 ప్రయోగం విజయవంతం కావడంతో భారత ప్రైవేటు రంగం కూడా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపగల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. 2022లో విక్రమ్-ఎస్ ద్వారా తొలి ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి పంపిన స్కైరూట్, తాజాగా విక్రమ్-1తో తొలి దేశీయ ప్రైవేట్ సబ్ ఆర్బిటాల్ ప్రయోగం చేపట్టింది. పయోగం విజయవంతం అయిన వెంటనే స్కైరూట్ యాజమాన్యం, సంబంధిత శాస్త్రవేత్తలు, గ్యాలరీల్లోని పలువురు సంబరాలు చేసుకున్నారు. విజయ సంకేతాలు చూపుతూ హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు భావోద్వేగానికి గురయ్యారు. ప్రయోగ సమయంలో ఇస్రో చెర్మన్ వి.నారాయణన్, పలువురు మాజీ చైర్మన్‌లు, ప్రముఖులు, ఏపీ మంత్రి నారా లోక్‌శ్ తదితరులు అక్కడే ఉన్నారు.
ప్రధాని మోడీకి స్కైరూట్ వ్యవస్థాపకుల ఫోన్..
విక్రమ్1 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం ప్రకటించారు. తాను ప్రయోగాన్ని స్వయంగా వీక్షించినట్లు వెల్లడించారు. స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ్ భరత్‌లు ప్రధాని మోడీకి ఫోన్ చేశారు. ప్రయోగం విజయవంతమైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారిని ప్రధాని అభినందించారు. అనుకున్న సమయానికన్నా ముందే లక్ష్యాన్ని చేధించారని ఈ సందర్భంగా మోడీ వారితో అన్నారు. ఈ మిషన్ మొదటి అడుగుమాత్రమేనని, ఇందులో భాగస్వాములైన వారందరికీ అభినందనలు చెబుతున్నాని అన్నారు. ప్రయోగం విజయవంతం కావడం ద్వారా దేశ యువతలో స్ఫూర్తి నింపారన్నారు. దేశ అంతరిక్ష రంగంలో మరింత స్వయం సమృద్ధం కావడానికి ఇది దోహదపడుతుందని ప్రధాని ప్రశంసించారు. ఈ రాకెట్‌ను పూర్తిగా దేశీయంగా తయారు చేశామని, ఇందులో అత్యధికులు యువకులే భాగస్వాములయ్యాయని ఈ సందర్భంగా పవన్ కుమార్ చందన ప్రధానికి వివరించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జితేంద్ర సింగ్ తదితరులు కూడా స్కైరూట్ వ్యవస్థాపకులకు శుభాకాంక్షలు తెలిపారు.











