రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు

ఐదు కీలక బిల్లులతో వస్తున్న ప్రభుత్వం

అదనుచూసి డీలిమిటేషన్, మహిళా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం

వాంగ్‌చుక్, అయోధ్య విరాళాల అవకతవకలపై నిలదీసేందుకు విపక్షం రెడీ

నేడు అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాడీవేడిగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సోమవారంనాటి నుంచి ప్రారంభం కానున్న సమావేశాల కోసం అటు ప్రభుత్వం, ఇటు విపక్షాలు వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం కొత్త బిల్లులతో సిద్ధమవుతూనే అదనుచూసి డీలిమిటేషన్, మహిళా బిల్లులను ప్రవేశపెట్టేందుకు వ్యూహ రచన చేస్తోంది. మరోవైపు డీలిమిటేషన్, మహిళా బిల్లులతో ప్రభుత్వం మళ్లీ సభ ముందుకు వస్తే ఎలాగైనా ఎండగట్టాలని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు గట్టిపట్టుదలతో ఉన్నాయి. సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను బలవంతంగా భగ్నం చేయడం, అయోధ్యలోని రామమందిరం విరాళాల్లో అవకతవ

కల అంశం ఈ సారి పార్లమెంట్‌ను కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిని ప్రధాన అస్త్రాలుగా మలుచుకోవాలని విపక్షం భావిస్తోంది. అదే సమయంలో విపక్షాన్ని సమర్థంగా ఎదుర్కొనే తాము ఆశించిన బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం కూడా పట్టుదలగా ఉంది. మరోవైపు ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెంది పలువురు ఎంపిలు షిండే వర్గంలో విలీనం కావడం, అటు మమతా బెనర్జీ టిఎంసికి చెందిన సుమారు 20 మంది ఎంపిలు రితబ్రత బెనర్జీ నాయకత్వంలోని రెబెల్ గ్రూప్ వైపు వెళ్లిన తర్వాత తాజా సమావేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక గత అసెంబ్లీలో ఓటమిపాలైన తర్వాత స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకె ఎంపిలు తొలిసారి లోక్‌సభకు హాజరుకాబోతున్నారు.

ఇండియా కూటమికి డిఎంకె గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో ఆ పార్టీ తాజా వైఖరికి స్వతంత్రంగా ఉండబోతోందా? లేకపోతే ఎన్‌డిఎకు కీలక సమయాల్లో మద్దతుగా నిలవబోతోందా? అన్నది ఉత్కంఠను రేపుతోంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో పాటు మహిళా బిల్లును తీసుకురావానలి మోడీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలో ఆ పార్టీ వైఖరి ఉభయ సభల్లో ఏవిధంగా ఉండబోతోందన్నదానిపై చర్చ నడుస్తోంది. మరోవైపు పార్లమెంట్ సమావేశాలకు ఒక రోజు ముందు అంటే నేడు(ఆదివారం) ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతోంది. ఈ సమావేశంలో ప్రభుత్వం ఐదు నూతన బిల్లులతో సభ ముందుకు వస్తోందని, వాటి ఆమోదానికి సహకరించాలని విపక్షాలను కోరనుంది. అయితే విపక్షం వాంగ్‌చుక్, అయోధ్య విరాళాల అవకతవకలపై చర్చకు పట్టుబట్టనుందని సమాచారం.