ఆసక్తికరమైన కథ.. కానీ అంచనాలను అందుకోలేకపోయిన క్రైమ్ థ్రిల్లర్! విడుదల తేదీ: సెప్టెంబర్ 18, 2026 TT రేటింగ్: ⭐ 7.1/10 నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ ఖాన్, జితేంద్ర జోషి, క్షితీ జోగ్ తదితరులు దర్శకత్వం: మేఘనా గుల్జార్ నిర్మాత: ధవల్ జయంతిలాల్ గడా సంగీతం: అమిత్ త్రివేది ఛాయాగ్రహణం: సౌరభ్ గోస్వామి ISC ఎడిటింగ్: చారు శ్రీ రాయ్ కథ ఓ దారుణమైన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేస్తారు. అయితే వారికి వెంటనే శిక్ష విధించాలంటూ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో క్రైమ్ సీన్ రీక్రియేషన్ సమయంలో డీసీపీ రమణ్ కుమార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన టీమ్‌తో కలిసి నిందితులను ఎదుర్కొంటాడు. నిందితులు తమపై దాడి చేసి ఆయుధాలను లాక్కున్నారని, ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులు కాల్పులు జరిపారని రమణ్ ఓ కథనాన్ని రూపొందిస్తాడు. మరోవైపు ఈ ఘటనపై హ్యూమన్ రైట్స్ విభాగం నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేస్తారు. ఈ SITకి డీసీపీ అజూనీ కోహ్లీ (కరీనా కపూర్ ఖాన్) నాయకత్వం వహిస్తుంది. ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలే సినిమా అసలు కథ. ప్లస్ పాయింట్స్ సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా సాగినా.. కొంతసేపటి తర్వాత కథ ఆసక్తికరంగా మారుతుంది. మొత్తం సినిమాకు ఓ గంభీరమైన, చీకటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలతో కథనం ఆకట్టుకుంటుంది. పోలీసులు నిందితులను వెంబడించి పట్టుకునే సన్నివేశాలను వాస్తవికంగా చూపించారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై క్షితీ జోగ్ ఆగ్రహం వ్యక్తం చేసే సన్నివేశం భావోద్వేగంగా ఆకట్టుకుంటుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ మరోసారి తన నటనతో మెప్పించారు. న్యాయం విషయంలో తనదైన ఆలోచనా విధానం ఉన్న పోలీస్ అధికారిగా ఆయన పాత్రను బలంగా పోషించారు. మైనస్ పాయింట్స్ ‘తక్షణ న్యాయం’ వర్సెస్ ‘న్యాయవ్యవస్థ ద్వారా న్యాయం’ అనే రెండు భిన్నమైన ఆలోచనా విధానాల మధ్య జరిగే నైతిక పోరాటంగా సినిమాను తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ తర్వాత పృథ్వీరాజ్, కరీనా పాత్రల మధ్య సిద్ధాంతపరమైన ఘర్షణ మరింత బలంగా ఉంటుందని ప్రేక్షకుడు ఆశిస్తాడు. కానీ సెకండాఫ్‌లో ఆ కాన్ఫ్లిక్ట్‌ను దర్శకురాలు పూర్తిస్థాయిలో ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయారు. ఇద్దరి మధ్య బలమైన ముఖాముఖి సన్నివేశాలు దాదాపుగా లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. చివర్లో వచ్చే చిన్న సన్నివేశం కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపదు. ఇలాంటి కీలకమైన అంశంపై మరిన్ని చర్చలు, సంఘర్షణలు, పాత్రల ఆలోచనా విధానాలను చూపించాల్సిన అవసరం ఉంది. పృథ్వీరాజ్ నటించిన Jana Gana Mana సినిమాలో కూడా హైదరాబాద్ దిశ కేసు నేపథ్యంలో న్యాయం, వ్యవస్థపై మరింత విస్తృతమైన చర్చను చూపించిన విషయం తెలిసిందే. కరీనా కపూర్ ఖాన్‌కు స్క్రీన్ టైమ్ తక్కువగా ఉండటం కూడా సినిమాకు మైనస్‌గా మారింది. ఆమె పాత్రను మరింత బలంగా డిజైన్ చేసి ఉంటే కథకు మరింత ప్రభావం వచ్చేది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథనం గాడి తప్పి బోరింగ్‌గా మారుతుంది. టెక్నికల్ అంశాలు కేతన్ సోధా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. కొన్ని ఇంటర్‌కట్స్‌ను చక్కగా తెరకెక్కించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. దర్శకురాలు మేఘనా గుల్జార్ నుంచి ఆశించిన స్థాయిలో దర్శకత్వం కనిపించలేదు. ఆమె గత చిత్రాలను దృష్టిలో పెట్టుకుంటే Daayra ఓ సాధారణ స్థాయి చిత్రంగానే అనిపిస్తుంది. పృథ్వీరాజ్, కరీనా పాత్రల మధ్య మరిన్ని సన్నివేశాలు ఉండి, వారి భిన్నమైన ఆలోచనా విధానాలపై ఎక్కువగా దృష్టి పెట్టి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేది. తీర్పు ఆసక్తికరమైన కథాంశం ఉన్నప్పటికీ Daayra పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని గ్రిప్పింగ్ మూమెంట్స్‌తో సినిమా ఆసక్తిని పెంచుతుంది. అయితే కీలకమైన సెకండాఫ్‌లో కథనం బలహీనపడుతుంది. పృథ్వీరాజ్, కరీనా పాత్రల మధ్య మొదటి భాగంలో ఏర్పడిన సిద్ధాంతపరమైన విభేదాలు చివర్లో ఓ బలమైన ముఖాముఖికి దారితీస్తాయని ఆశించినా.. ఆ స్థాయిలో క్లైమాక్స్ లేకపోవడం సినిమాకు ప్రధాన మైనస్. మొత్తంగా.. ఆసక్తికరమైన పాయింట్ ఉన్నా, దాన్ని పూర్తిస్థాయిలో తెరపై ఆవిష్కరించలేకపోయిన క్రైమ్ థ్రిల్లర్ Daayra.