అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఆధ్వర్యంలో “ఇంటర్నేషనల్ యోగా డే 2026” వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతత కోసం ప్రత్యేకంగా 20 రోజుల ఉచిత యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
జూన్ 1 నుంచి జూన్ 20, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 7:15 గంటల నుంచి 8:00 గంటల వరకు (EST టైమింగ్) గూగుల్ మీట్ మరియు జూమ్ ద్వారా ఆన్‌లైన్ యోగా తరగతులు నిర్వహించనున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21, 2026న అమెరికాలోని జార్జియా రాష్ట్రం మిల్టన్ నగరంలోని ఫౌలర్ పార్క్ / కాలే క్రీక్ పార్క్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి యోగా సెషన్లు, సంబరాలు, కమ్యూనిటీ కార్యక్రమాలు జరగనున్నాయి.
ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితమని, అన్ని వయస్సుల వారు మరియు అన్ని స్థాయి యోగా అభ్యాసకులు పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.
యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు సమాజంలో ఐక్యత పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 5 ప్రత్యేక ఛాలెంజ్‌లు నిర్వహించి, విజేతలకు 7 బహుమతులు అందించనున్నారు.
సర్టిఫైడ్ యోగా ఇన్‌స్ట్రక్టర్ శిరీష మంత్రి యోగా తరగతులను నిర్వహించగా, కార్యక్రమ సమన్వయకర్తగా గోపాల్ వల్లభజోస్యుల వ్యవహరిస్తున్నారు.
ప్రతిరోజూ జరిగే ఆన్‌లైన్ యోగా సెషన్లలో పాల్గొనాలనుకునే వారు ఫ్లెక్సీలో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.














