అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ATA ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడును కలిసి, అమెరికాలో ఘనంగా జరగనున్న ఆటా 19వ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమై, సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు, తెలుగు సమాజ అభివృద్ధికి నిర్వహిస్తున్న కార్యాచరణ, మహాసభల ప్రత్యేకతలపై విస్తృతంగా చర్చించారు.
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రలో బాల్టిమోర్ వేదికగా జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు ఈ ప్రతిష్ఠాత్మక మహాసభలు నిర్వహించనున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, వ్యాపారం, విద్య, యువత, సాంకేతిక రంగాలకు సంబంధించిన విభిన్న కార్యక్రమాలతో ఈ సదస్సు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ సందర్భంగా ఆటా అధ్యక్షుడు జయంత్ చల్ల, కన్వీనర్ శ్రీధర్ బానాల తదితర ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఆటా మహాసభలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వారు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలుగు సంఘాల సేవలను అభినందిస్తూ, విదేశాల్లో తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించడంలో ఆటా వంటి సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు ఈ మహాసభలు మరింత ఐక్యతను తీసుకురావాలని ఆకాంక్షించారు.




















