అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో అమెరికాలోని బాల్టిమోర్, మేరీల్యాండ్ వేదికగా జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు నిర్వహించనున్న 19వ ఆటా యువజన మహాసభలకు ఎంఎస్‌ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మన్నె సత్యనారాయణ రెడ్డి (డాక్టర్ ఎంఎస్‌ఎన్)ను ఆటా ప్రతినిధులు ఘనంగా ఆహ్వానించారు.
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బనాలాతో పాటు ఇతర ఆటా ప్రతినిధులు డాక్టర్ ఎంఎస్‌ఎన్‌ను కలిసి మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులు మాట్లాడుతూ తెలుగు యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సాంస్కృతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో ఈ యువజన మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ముఖ్యమైన కార్యక్రమంగా ఈ సదస్సు నిలవనుందని పేర్కొన్నారు.
ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు యువత ఈ మహాసభల్లో పాల్గొననున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రముఖుల పాల్గొనడం సభలకు మరింత ప్రత్యేకత, గౌరవాన్ని తీసుకువస్తుందని ఆటా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. డాక్టర్ ఎంఎస్‌ఎన్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్త యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని వారు తెలిపారు.















