అమెరికాలో జరగనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) యువజన సదస్సుకు తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆటా ప్రతినిధులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. USAలోని బాల్టిమోర్, మేరీల్యాండ్ వేదికగా జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు నిర్వహించనున్న ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్ల, కన్వీనర్ శ్రీధర్ బానాల తదితర ప్రతినిధులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు.

యువతలో తెలుగు సంస్కృతి, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ యువజన సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన ఆటా ప్రతినిధులు అమెరికాలోని తెలుగు యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఈ సదస్సు విశేష ప్రాధాన్యం సంతరించుకుందని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యువతకు ఇది ఒక గొప్ప అవకాశమని, ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల పాల్గొనడం మరింత ప్రత్యేకతను తీసుకువస్తుందని అభిప్రాయపడ్డారు.