అమెరికాలోని తెలుగు లోగిళ్లలో అందాల వేడుకలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నిర్వహిస్తున్న 19వ మహాసభల్లో భాగంగా ‘ఆటా పేజెంట్ 2026’ పోటీలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ మహాసభలు తెలుగు యువత, యువకులు, మహిళల ప్రతిభ, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించే అవకాశంగా నిలవనున్నాయి.

అట్లాంటా, ఆస్టిన్, చికాగో, డల్లాస్, డెట్రాయిట్, డీసీ-ఎండీ-వీఏ, లాస్ ఏంజెల్స్, నాష్విల్లే, న్యూజెర్సీ, ఓర్లాండో, ఫీనిక్స్, ఫిలడెల్ఫియా, రాలీ తదితర నగరాల నుంచి పోటీదారులు పాల్గొననున్నారు. మొత్తం ఐదు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు.

  • *మిస్ టీన్ ఆటా – 13 నుంచి 16 ఏళ్ల బాలికల కోసం

  • *మిస్ ఆటా – 17 ఏళ్లు పైబడిన యువతుల కోసం

  • *మిస్టర్ టీన్ ఆటా – 13 నుంచి 17 ఏళ్ల లోపు బాలుర కోసం

  • *మిస్టర్ ఆటా – 17 ఏళ్లు పైబడిన యువకుల కోసం

  • *మిసెస్ ఆటా – 21 ఏళ్లు పైబడిన వివాహిత మహిళల కోసం ప్రత్యేక విభాగం

ఈ పోటీల్లో పాల్గొనదలచిన ఆటా సభ్యులు 30 డాలర్లు, సభ్యులు కాని వారు 50 డాలర్ల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు ప్రతిష్టాత్మక ‘ఆటా టైటిల్’తో పాటు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రత్యేక అవార్డులు అందజేయనున్నారు.

తెలుగు అందం, ప్రతిభ, వ్యక్తిత్వానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ పేజెంట్‌కు ఆసక్తి గల వారు ఆటా అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

ata pagent.jpg