ఉత్తర అమెరికా తెలుగు సంఘం -తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పికిల్‌బాల్ టోర్నమెంట్‌కు ఈ ఏడాది రికార్డు స్థాయిలో స్పందన లభిస్తోంది. జూన్ 6న జరగనున్న ఈ క్రీడా పోటీల కోసం ఇప్పటికే 65 జట్లు నమోదు చేసుకోవడంతో, టోర్నమెంట్‌పై తెలుగు సమాజంలో విశేష ఆసక్తి నెలకొంది.

నార్త్ కరోలినా, కన్నాపోలిస్‌లోని కరోలినా పికిల్‌బాల్ క్లబ్ వేదికగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోటీలు నిర్వహించనున్నారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది ఆటగాళ్లు పాల్గొంటుండటమే కాకుండా, మహిళల భాగస్వామ్యం కూడా రికార్డు స్థాయికి చేరుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న క్రీడల్లో ఒకటిగా గుర్తింపు పొందిన పికిల్‌బాల్‌కు తెలుగు కమ్యూనిటీలోనూ ఆదరణ పెరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్‌డ్ విభాగాలతో పాటు మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి.

విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు ప్రకటించారు. ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై క్రీడాకారులను ప్రోత్సహించాలని టానా ప్రతినిధులు కోరారు.

"పోటీ మాత్రమే కాదు.. తెలుగు సమాజాన్ని ఒక్క వేదికపైకి తీసుకువచ్చే క్రీడా వేడుకగా ఈ టోర్నమెంట్ నిలవనుంది. ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు, అభిమానులు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి" అని నిర్వాహకులు పేర్కొన్నారు.

తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, ఈవీపీ లావు శ్రీనివాస్, అప్పలాచియన్ రీజినల్ ప్రతినిధి రవి (నాని) వడ్లమూడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ప్రాంతీయ తెలుగు క్రీడా చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

tana picle ball flayer.jpeg