అమెరికన్ తెలుగు అసోసియేషన్- ATA ఆధ్వర్యంలో 2026 మహిళా దినోత్సవం మరియు ఉగాది వేడుకలు అమెరికాలోని మిల్వాకీలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో 350 మందికి పైగా పాల్గొని వేడుకలను ఘనవిజయంగా నిలిపారు. దీపాలంకరణతో కార్యక్రమం ప్రారంభమై ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. అనంతరం పూజారి శ్రవణ్ ఉగాది పంచాంగాన్ని వినిపించి, నూతన సంవత్సర రాశిఫలాలను వివరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ అశ్వని గుండెల్లి ఆరోగ్యంగా, సంతోషంగా జీవించేందుకు అవసరమైన ఆరోగ్య సూత్రాలు మరియు జీవనశైలి గురించి ఆసక్తికరంగా వివరించారు.

మహిళలు ఇంటి వద్ద తయారు చేసిన ఉగాది పచ్చడిని తీసుకువచ్చి ప్రత్యేక పోటీల్లో పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా చిన్నారులు నృత్యాలు, సంప్రదాయ నాటికలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘బాల రామాయణం’ నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నాటికలో 20 మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు.

వేడుకలకు విచ్చేసిన అతిథులందరికీ సంప్రదాయ తెలుగు వంటకాలతో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. నృత్యాలు, నాటికల్లో పాల్గొన్న వారికి ATA సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.