అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు వారి ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ‘డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్’ (DARA) మరోసారి సేవా కార్యక్రమాలతో ముందుకొచ్చింది. సమాజ సేవ లక్ష్యంగా జూన్ 27, 2026న ఫ్రిస్కోలోని వారెన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో భారీ స్థాయిలో “DARA 5K Walk & Run Fund Raiser Event” నిర్వహించనుంది.
ఈ కార్యక్రమం ద్వారా సమీకరించే నిధులను అనాథాశ్రమాలు మరియు వృద్ధాశ్రమాల సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలుగు కుటుంబాలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సేవా యజ్ఞాన్ని విజయవంతం చేయాలని DARA పిలుపునిచ్చింది.
అదే రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించనున్నారు. ఇందులో BMI, Blood Pressure, ECG, HbA1c వంటి ఆరోగ్య పరీక్షలు ఉచితంగా అందించనున్నారు. భారతీయుల్లో గుండె సంబంధిత వ్యాధులు, షుగర్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు ఎంతో అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
“మన సమాజానికి తిరిగి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. కుటుంబ సమేతంగా పాల్గొని ఆరోగ్యంతో పాటు సేవా భావాన్ని చాటుదాం” అని DARA ప్రతినిధులు పేర్కొన్నారు.














