అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది గ్రేట్ ఇండియన్ ఫుడ్ అండ్ షాపింగ్ ఫెస్ట్ (TGIFS)’తో పాటు ‘మ్యాంగో ఫెస్టివల్’ అమెరికాలోని శాన్ రామన్‌లోని బిషప్ రాంచ్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. బే ఏరియా నలుమూలల నుంచి సుమారు 15 వేల మందికి పైగా సందర్శకులు తరలివచ్చి ఈ సాంస్కృతిక, ఆహార, వినోద వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ ఏడాది ఉత్సవాల్లో మ్యాంగో ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీజనల్ మామిడిపండ్లతో తయారైన డెజర్ట్స్, పానీయాలు, స్వీట్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. మామిడి రుచులను ఆస్వాదించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు.

ఇక 100కు పైగా స్టాళ్లలో భారతీయ మరియు అంతర్జాతీయ వంటకాలు, దుస్తులు, జ్యువెలరీ, హస్తకళలు, గృహాలంకరణ వస్తువుల ప్రదర్శనలు సందర్శకులను ఆకర్షించాయి. నాన్‌స్టాప్ లైవ్ ఎంటర్టైన్మెంట్, నృత్య ప్రదర్శనలు, కచేరీలు, డీజే హంగామా, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మదర్స్ డే సందర్భంగా నిర్వహించిన ‘చీరల ప్రదర్శన’కు విశేష స్పందన లభించింది. చిన్నారుల కోసం కార్నివాల్ రైడ్స్, గేమ్స్ ఏర్పాటు చేశారు. బే ఏరియాలో వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఈ ఫెస్టివల్ స్థానిక వ్యాపారవేత్తలకు మంచి వేదికగా నిలుస్తోందని ఏఐఏ ప్రతినిధులు తెలిపారు.