అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరంలోని శుభం ఈవెంట్ సెంటర్ లో (Shubham Event Center) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్‌ఆర్‌ఐ సభ్యులు ఘనంగా నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ విత్ TJR సుధాకర్ బాబు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, అభిమానులు, ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే TJR సుధాకర్ బాబుని ఎన్‌ఆర్‌ఐ సభ్యులు ఘనంగా సత్కరించారు. పార్టీ బలోపేతం, ప్రవాస భారతీయుల భాగస్వామ్యం, భవిష్యత్ కార్యక్రమాలపై నాయకులు చర్చించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఆకస్మికంగా మరణించిన వైయస్‌ఆర్‌సీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్, APNRTS , USA మాజీ కో-ఆర్డినేటర్ శ్రీ ముని శేఖర్ దువ్వూరుని స్మరించుకుంటూ ప్రత్యేకంగా నివాళులు అర్పించారు. ఆయన మరణం పార్టీకి మాత్రమే కాకుండా ప్రవాస తెలుగు సమాజానికి కూడా తీరని లోటని పలువురు నాయకులు భావోద్వేగంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆయనతో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి నివాళులు అర్పించారు.
ముని శేఖర్ వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, అలాగే APNRTS USA మాజీ కో-ఆర్డినేటర్‌గా సేవలందిస్తూ ప్రవాస భారతీయులతో పార్టీ బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని వక్తలు కొనియాడారు. పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి, ప్రజల పట్ల చూపిన ఆప్యాయత, నిస్వార్థ సేవ చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ముని శేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందరూ రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులు అర్పించారు.
























