అమెరికాలోని తెలుగు వారి ప్రముఖ సంస్థ ఉత్తర అమెరికా తెలుగు సంఘం- తానా ( Telugu Association of North America) మహిళల క్రీడలకు ప్రోత్సాహం అందించే దిశగా మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తానా క్రీడా విభాగం ఆధ్వర్యంలో, తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ పర్యవేక్షణలో ‘తానా మిడ్ అట్లాంటిక్ ఉమెన్స్ త్రోబాల్-2026’ టోర్నమెంట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మహిళల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, తెలుగు కమ్యూనిటీ మహిళలకు వేదిక కల్పించడం లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఉత్సాహభరితమైన త్రోబాల్ పోటీలు 2026 జూన్ 13వ తేదీ శనివారం అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్‌కు వేదికగా లోయర్ పెర్కియోమెన్ వ్యాలీ పార్క్ (Lower Perkiomen Valley Park) ను ఎంపిక చేశారు.
పోటీల్లో విజేతలుగా నిలిచే జట్లకు ఆకర్షణీయమైన ట్రోఫీలతో పాటు భారీ నగదు బహుమతులను అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. టోర్నమెంట్‌లో పాల్గొనదలచిన జట్లకు ఒక్కో టీంకు 149 అమెరికన్ డాలర్ల రిజిస్ట్రేషన్ ఫీజును నిర్ణయించారు. ఆసక్తి గల జట్లు ఆన్‌లైన్ ద్వారా తమ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.
పోటీల సందర్భంగా పాల్గొనే క్రీడాకారిణులు మరియు ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఆహార వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తానా మిడ్ అట్లాంటిక్ నిర్వాహక బృందం పేర్కొంది. టోర్నమెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం phillytana@gmail.com ఈమెయిల్ లేదా (610) 620-4135 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
పెన్సిల్వేనియా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు మహిళా క్రీడాకారిణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
















