అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు కళాసమితి (TFAS) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలు, పురస్కారాల ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెలుగు సంస్కృతి, సాహిత్యం, కళలకు అద్దం పట్టేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగువారి నుంచి విశేష స్పందన లభించింది.

ఈ వేడుకలకు పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడు, ఉపేంద్ర చివుకుల, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తెలుగు కళా సమితి అధ్యక్షుడు మధుసూదనరావు అన్నా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా సాగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన డా. నోరి దత్తాత్రేయుడు.. “భాషే సాంస్కృతిక వారధి. ఒక జాతి అస్థిత్వాన్ని, ప్రత్యేకతను నిలబెట్టేది మాతృభాషే” అని పేర్కొన్నారు. తెలుగువారి సమక్షంలో ఉగాది పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తనను వైద్య, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించారని వెల్లడించారు.

TFAS అధ్యక్షుడు మధు అన్నా మాట్లాడుతూ.. తనకు లభించిన రెండేళ్ల పదవీకాలాన్ని సేవా భావంతో, బాధ్యతగా నిర్వహించానన్నారు. ప్రవాసాంధ్రుల మధ్య తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో TFAS కీలక పాత్ర పోషిస్తోందని మన్నవ సుబ్బారావు అభినందించారు. మాతృభాషను విస్మరించిన ఏ జాతి కూడా మనుగడ సాగించలేదని ఆర్పీ పట్నాయక్ అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా TFAS మాజీ అధ్యక్షుడు దాము గేదల సేవలను గుర్తిస్తూ జీవితకాల సాఫల్య పురస్కారం అందజేశారు. అలాగే స్వర సామ్రాట్ డా. టి.శరత్ చంద్ర, రంగస్థల కళాకారుడు అశోక్ చింతకుంటను ఉగాది పురస్కారాలతో సత్కరించారు.

కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోకిల మంజులశ్రీ పంచాంగ శ్రవణం చేయగా, చిట్టి శర్మ వేద పఠనం చేశారు.

2024-26 TFAS కార్యవర్గ సభ్యులు సత్య వెంకటతాతా, ప్రసాద్ ఊటుకూరి, వాణి కూనిశెట్టి, శేషగిరిరావు కంభంనెట్టు, అరుంధతి శావెల్లి, వరలక్ష్మి రాధాకృష్ణ, లత మాదిశెట్టి, లోకేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అలాగే 2026-28 కాలానికి అధ్యక్షురాలిగా ఎన్నికైన ఉమా మాఖంతో పాటు కొత్త కార్యవర్గ సభ్యులతో సుధాకర్ ఉప్పల ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగు ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు TFAS మరింత కృషి చేస్తుందని నూతన బృందం హామీ ఇచ్చింది.