అమెరికాలోని డల్లాస్ నగరం తెలంగాణ సాంస్కృతిక వైభవానికి వేదికైంది. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్ప్రింగ్ ఫెస్ట్-2026’ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వేలాది మంది తెలుగు కుటుంబాలు హాజరై ఈ వేడుకలను విజయవంతం చేశాయి.
టెక్సాస్‌లోని గ్రాండ్‌స్కేప్ లాన్ అండ్ స్టేజ్ వేదికగా జరిగిన ఈ ఫ్యామిలీ ఫెస్టివల్ సందడి, సంగీతం, ఆటపాటలతో కళకళలాడింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ వినోదాన్ని పంచేలా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ వేడుకల్లో ప్రముఖ గాయకుడు మెహర్ చంటి నేతృత్వంలోని M-Live Band లైవ్ మ్యూజిక్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సంగీత బృందం, డల్లాస్‌లోనే ఒక మినీ తెలంగాణ వాతావరణాన్ని సృష్టించింది. పాటలకు అనుగుణంగా ప్రేక్షకులు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గేమ్స్, ఫన్ యాక్టివిటీస్, 360 డిగ్రీల ఫోటో బూత్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా నిర్వహించిన రాఫెల్స్ (లక్కీ డ్రా) కార్యక్రమం అందరిలోనూ ఉత్కంఠను పెంచింది.
ఫుడ్ మరియు షాపింగ్ వెండర్ స్టాళ్లకు భారీ స్పందన లభించింది. తెలంగాణ సంప్రదాయ రుచులతో పాటు వివిధ భారతీయ వంటకాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. కుటుంబ సమేతంగా వచ్చిన తెలుగు ప్రజలు ఆహారం, సంగీతం, వినోదాన్ని ఆస్వాదిస్తూ సాయంత్రం మొత్తం ఉత్సాహంగా గడిపారు.
ఈ కార్యక్రమాన్ని TPAD అధ్యక్షురాలు లక్ష్మి పోరెడ్డి ఆధ్వర్యంలో ట్రస్టీ బోర్డ్ చైర్ రవికాంత్ మామిడి, కోఆర్డినేటర్ లింగారెడ్డి ఆల్వా, ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు మరియు ఇతర సభ్యులు సమన్వయం చేశారు. కార్యక్రమం విజయవంతం కావడంలో వాలంటీర్లు, స్పాన్సర్లు, కమ్యూనిటీ సభ్యుల సహకారం ఎంతో కీలకమైందని నిర్వాహకులు తెలిపారు.
“తెలుగు ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తదుపరి తరాలకు పరిచయం చేయడం TPAD లక్ష్యం” అని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.













