తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించింది టీటీడీ. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుమల గిరులు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి.
గోగర్భం వద్ద కాళీయమర్దన స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కాళీయమర్దన స్వామివారి ఆశీస్సులతో ఉట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొనగా.. పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఇక తిరుమాడ వీధులు గోవింద నామస్మరణతో పాటు.. కృష్ణ నామస్మరణలతో మార్మోగిపోయాయి. వేణుగాన మాధుర్యాన్ని తలపించే భక్తి వాతావరణం.. శ్రీకృష్ణుడి లీలలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలతో తిరుమల కొండలు పులకించిపోయాయి.
మొత్తంగా.. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలతో తిరుమలలో భక్తి వెల్లివిరిసింది.గోవిందా.. గోవిందా.. కృష్ణా.. కృష్ణా అంటూ మార్మోగిన తిరుమల.. ఆధ్యాత్మిక శోభతో మరింత వైభవంగా కనిపించింది.









