ఏపీలోని మార్కాపురం జిల్లాలో వింత ఘటన భక్తులను ఆకట్టుకుంటోంది. గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లెలోని గ్రామదేవత పోలేరమ్మ ఆలయంలో కంచి కామాక్షి అమ్మవారి విగ్రహానికి సాధారణంగా ఉండే కళ్లకు పైన మరో రెండు కళ్లు కనిపిస్తున్నాయని అర్చకులు చెబుతున్నారు. దీంతో ఈ విషయం గ్రామంలో ఆసక్తికర చర్చకు దారితీసింది.
ప్రస్తుతం పోలేరమ్మ ఆలయంలో 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అయితే గత ఐదు రోజులుగా అమ్మవారి విగ్రహానికి ఉన్న పెట్టుడు కళ్లకు పైన మరో రెండు కళ్లు కనిపిస్తున్నట్లు అర్చకులు గుర్తించారు.
కంచి కామాక్షి అమ్మవారికి నయనం (కళ్లు) అత్యంత ప్రాధాన్యమైనవని, విగ్రహంపై అదనంగా రెండు కళ్లు కనిపించడం అద్భుతంగా భావిస్తున్నామని అర్చకులు తెలిపారు. దీంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు దర్శనం చేసుకుంటున్నారు.
కంచి కామాక్షి అమ్మవారి రూపానికి ఎంతో విశిష్టత ఉందని భక్తుల విశ్వాసం. కంచిలోని ప్రసిద్ధ కామాక్షి ఆలయంలో అమ్మవారే ప్రధాన దేవతగా కొలువుదీరారు. ఆదిశంకరాచార్యులు అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని భక్తుల నమ్మకం. కామాక్షి అమ్మవారి కంటి చూపులో దయ, జ్ఞానం, ఐశ్వర్యం కలగలిసి ఉంటాయని విశ్వసిస్తారు.
సుమారు తొమ్మిదేళ్ల క్రితం క్రిష్టంశెట్టిపల్లెలోని పోలేరమ్మ ఆలయంలో కంచి కామాక్షి అమ్మవారి రూపంలోని దేవతామూర్తిని ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. 9వ వార్షికోత్సవ వేడుకల సమయంలోనే అదనంగా రెండు కళ్లు కనిపించడం భక్తుల్లో మరింత ఆసక్తిని పెంచింది.
ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. అమ్మవారి విగ్రహంపై కనిపిస్తున్న అదనపు కళ్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ ఘటనపై గ్రామంలో ఆసక్తి నెలకొంది.














