వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా భారీ గణేష్ విగ్రహాలు.. రంగురంగుల మండపాలు.. భక్తి పాటలు.. సాంస్కృతిక కార్యక్రమాలు.. సందడే సందడి! కానీ అసలు వీధుల్లో భారీ వినాయకుడిని ప్రతిష్టించే సంప్రదాయం ఎలా మొదలైంది? కేవలం భక్తి కోసమేనా? లేక దీని వెనుక ఓ పెద్ద చరిత్ర ఉందా?

వాస్తవానికి.. వీధుల్లో సామూహికంగా గణేష్ విగ్రహాలను ప్రతిష్టించే సంప్రదాయం వెనుక ఆధ్యాత్మికతతో పాటు సామాజిక, చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి.

బ్రిటిష్ పాలనలోనే కీలక మలుపు..

భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో బ్రిటిష్ పాలకులు ప్రజలు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి రాజకీయ సమావేశాలు నిర్వహించడంపై ఆంక్షలు విధించేవారు.అలాంటి సమయంలో ప్రజలను ఒక వేదికపైకి తీసుకురావడానికి లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలను సామూహికంగా నిర్వహించేలా ప్రోత్సహించారు.

1893లో మహారాష్ట్రలో సామూహిక గణేష్ ఉత్సవాలు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. అప్పటివరకు ప్రధానంగా ఇళ్లకే పరిమితమైన గణపతి పూజ.. క్రమంగా వీధులు, బహిరంగ ప్రదేశాలు, మండపాలకు చేరింది.గణపతి అందరికీ ఆరాధ్యదైవం కావడంతో.. ఆయన ఉత్సవాలు ప్రజలను ఒకచోట చేర్చే వేదికగా మారాయి. భక్తి పేరుతో కలిసిన ప్రజల్లో జాతీయ భావన, ఐక్యత కూడా బలపడింది.

కులమత భేదాలకు అతీతంగా..

ఆ రోజుల్లో సమాజంలో కుల విభజనలు తీవ్రంగా ఉండేవి. అందరికీ అన్ని దేవాలయాల్లో సమానంగా ప్రవేశం ఉండేది కాదు.
కానీ సామూహిక గణేష్ మండపాలు మాత్రం పేద, ధనిక, కులం, వర్గం అనే తేడాలు లేకుండా అందరూ కలిసి పూజించే వేదికలుగా మారాయి.ఒకే మండపం.. ఒకే గణపతి.. ఒకే భక్తి!ఈ సామూహిక పూజలతో ప్రజల మధ్య సామాజిక సమరసత, ఐక్యత పెరిగింది.

పూజతో పాటు పండగ సందడి..

వీధుల్లో భారీ గణేష్ విగ్రహాలను ప్రతిష్టించడం కేవలం పూజకే పరిమితం కాలేదు.మండపాల వద్ద భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది.

దీంతో ఒక ప్రాంతంలోని ప్రజలంతా కలిసి పండుగను జరుపుకునే అవకాశం ఏర్పడింది.భారీగా అలంకరించిన గణపతి విగ్రహాలు భక్తులను ఆకట్టుకోవడంతో పాటు.. పండుగ వాతావరణాన్ని మరింత ఘనంగా మార్చాయి.

అందుకే.. ఇంట్లోనూ గణపతి.. వీధిలోనూ గణపతి!

ఇప్పటికీ చాలామంది ఇళ్లలో చిన్న వినాయకుడిని ప్రతిష్టించి పూజిస్తూనే.. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, వీధుల్లో సామూహికంగా భారీ గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.అందుకే వీధి వినాయకుడు అంటే కేవలం ఓ భారీ విగ్రహం కాదు..భక్తికి ప్రతీక.. సామాజిక ఐక్యతకు వేదిక.. చరిత్రను గుర్తుచేసే ఓ సంప్రదాయం!

కాలం మారినా.. రూపం మారినా..“అందరూ కలిసి జరుపుకునే పండుగ” అనే గణేష్ ఉత్సవాల స్ఫూర్తి మాత్రం కొనసాగుతూనే ఉంది.