సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ విడాకుల కేసు తెగ వైరల్ అవుతోంది. కారణం.. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ గేమింగ్ కంపెనీ స్మైల్‌గేట్ (Smilegate) వ్యవస్థాపకుడు క్వాన్ హ్యుక్-బిన్‌కు సంబంధించిన ఈ కేసులో కోర్టు సంచలన తీర్పు ఇవ్వడమే. మాజీ భార్యకు భారీ మొత్తంలో ఆస్తులు, కంపెనీ వాటా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసు దక్షిణ కొరియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మాజీ భార్యకు రూ.18 వేల కోట్లు

క్వాన్ హ్యుక్-బిన్ తన మాజీ భార్య లీ హ్వా-జిన్‌కు 2.55 ట్రిలియన్ వోన్ విలువైన ఆస్తులను ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.18 వేల కోట్లు. దీంతో ఇది దక్షిణ కొరియా చరిత్రలోనే అతిపెద్ద విడాకుల సెటిల్‌మెంట్‌గా నిలిచింది.

గతంలో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం చెయ్ టే-వోన్ తన మాజీ భార్యకు 944 బిలియన్ వోన్ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఆ రికార్డును క్వాన్ హ్యుక్-బిన్ కేసు అధిగమించింది.

ఎవరీ క్వాన్ హ్యుక్-బిన్?

క్వాన్ హ్యుక్-బిన్ దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ బిలియనీర్లలో ఒకరు. ఆయన స్థాపించిన స్మైల్‌గేట్ దేశంలోని అతిపెద్ద వీడియో గేమింగ్ కంపెనీల్లో ఒకటి. ఈ సంస్థ రూపొందించిన క్రాస్‌ఫైర్ (Crossfire), లాస్ట్ ఆర్క్ (Lost Ark) వంటి గేమ్స్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయి.

బ్లూమ్‌బర్గ్ అంచనాల ప్రకారం క్వాన్ హ్యుక్-బిన్ సంపద సుమారు 3 బిలియన్ డాలర్లు.

35 శాతం కంపెనీ వాటా బదిలీ

కోర్టు తీర్పు ప్రకారం.. స్మైల్‌గేట్‌లో క్వాన్ హ్యుక్-బిన్‌కు ఉన్న 35 శాతం వాటాను ఆయన మాజీ భార్య లీ హ్వా-జిన్‌కు బదిలీ చేయాలి. ఈ వాటా విలువ సుమారు 2.5 ట్రిలియన్ వోన్గా అంచనా. దీనికి అదనంగా 65 బిలియన్ వోన్ నగదుగా చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.

కంపెనీ స్థాపనలో తన పాత్ర ఉందన్న మాజీ భార్య

క్వాన్ హ్యుక్-బిన్, లీ హ్వా-జిన్‌లు 2001లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికే, అంటే 2002లో క్వాన్ స్మైల్‌గేట్‌ను స్థాపించారు.

విడాకుల కేసు సందర్భంగా లీ హ్వా-జిన్ కంపెనీలో 50 శాతం వాటాను కోరారు. స్మైల్‌గేట్ ప్రారంభ సమయంలో తాను ఆర్థికంగా సహాయం చేశానని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వివాహం తర్వాత రెండు దశాబ్దాలకు పైగా కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకంలో తాను కీలక పాత్ర పోషించానని లీ పేర్కొన్నారు. కంపెనీ ఏర్పాటులో తన సహకారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

క్వాన్ వాదన ఏంటి?

అయితే క్వాన్ హ్యుక్-బిన్ మాత్రం లీ కంపెనీలో పెట్టుబడి పెట్టలేదని, సంస్థ కోసం పనిచేయలేదని వాదించారు. స్మైల్‌గేట్ కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఓ ప్రకటన చేస్తూ.. కంపెనీ ప్రారంభానికి అవసరమైన మొత్తం పెట్టుబడిని క్వాన్ ఒక్కరే సమకూర్చారని తెలిపింది.

అయినప్పటికీ కోర్టు తాజాగా లీ హ్వా-జిన్‌కు భారీ మొత్తంలో ఆస్తులతో పాటు కంపెనీలో 35 శాతం వాటా ఇవ్వాలని తీర్పు చెప్పింది. దీంతో ఈ కేసు దక్షిణ కొరియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.