పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి బ్లాక్ మనీ కేసులో ముంబై హైకోర్టు కీలక ఊరట కల్పించింది. రూ.814 కోట్లకు పైగా విలువైన విదేశీ ఆస్తుల వ్యవహారంలో ఆయనపై ప్రాసిక్యూషన్, జరిమానా సహా ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు ఆదేశించింది. జస్టిస్ బి.పీ. కోలబవాలా, జస్టిస్ ఫిర్దోష్ పూనీవాలాలతో కూడిన ధర్మాసనం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

స్విస్ బ్యాంకు ఖాతాలు, బహమాస్‌కు చెందిన డైమండ్ ట్రస్ట్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని సంస్థల్లో వెల్లడించని విదేశీ ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ ఆదాయపు పన్ను శాఖ అంబానీపై బ్లాక్ మనీ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ ఆస్తులపై సుమారు రూ.420 కోట్ల పన్ను ఎగవేత జరిగిందని ఆరోపిస్తోంది.

అయితే, సంబంధిత లావాదేవీలు 2006 నుంచి 2011 మధ్య జరిగాయని, బ్లాక్ మనీ చట్టం మాత్రం 2015లో అమల్లోకి వచ్చిందని అంబానీ వాదిస్తున్నారు. చట్టం అమలుకు ముందున్న లావాదేవీలపై దాన్ని వర్తింపజేయలేమని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్లతో పాటు అంబానీ పిటిషన్‌ను కూడా విచారిస్తామని హైకోర్టు తెలిపింది.