మానసిక ఆరోగ్య కేంద్రాల పేర్లను ‘హ్యాపీనెస్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు’గా మార్చాలని కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేరళ హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న రోగులు, వారి కుటుంబ సభ్యులు, అలాగే ఈ కేంద్రాలపై ఇప్పటివరకు ఉన్న సామాజిక ముద్రను విస్మరించలేమని కోర్టు పేర్కొంది.
జస్టిస్ దేవన్ రామచంద్రన్, జస్టిస్ బసంత్ బాలాజీతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల తిరువనంతపురం, త్రిశూర్, కోజికోడ్‌లోని మానసిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించింది. ఈ సందర్భంగా కేంద్రాల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం.. కేవలం పేర్లు మార్చడం కాకుండా, రోగుల పట్ల గౌరవం, మానవ హక్కుల పరిరక్షణలోనూ మార్పు రావాలని అభిప్రాయపడింది.
ఈ కేంద్రాలు ఉన్న ప్రాంతాలను సైతం తరచుగా అవమానకరంగా, ప్రతికూలంగా ప్రస్తావిస్తుంటారని కోర్టు పేర్కొంది. పేరు మార్పు మనం కోరుకుంటున్న మార్పుకు దోహదం చేస్తుందని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించింది.
మానసిక ఆరోగ్య కేంద్రాల్లో రోగుల మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగితే.. అది నాగరిక సమాజానికే అవమానకరమని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.
మరోవైపు, కేంద్రాల్లో మౌలిక వసతుల కొరత, సిబ్బంది ఖాళీల సమస్యలను ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పరిశీలిస్తోందని కేరళ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ.. వీలైనంత త్వరగా ఈ కేంద్రాలను రోగులకు గౌరవప్రదమైన చికిత్స, మానవీయ వాతావరణం అందించే స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.












