అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ (AAPI) 44వ వార్షిక సదస్సు, సైంటిఫిక్ అసెంబ్లీ సందర్భంగా వైద్యరంగంలో విశిష్ట సేవలు అందించిన ముగ్గురు ప్రముఖ వైద్యులను "మోస్ట్ డిస్టింగ్విష్డ్ ఫిజీషియన్స్ అవార్డు"తో సత్కరించింది. జూలై 2 నుంచి 5 వరకు ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన ఈ మహాసభలో ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా వైద్యులు, పరిశోధకులు, ఆరోగ్య నిపుణులు పాల్గొన్నారు.
ఈ ఏడాది డా. నవీన్ సి. షా, డా. అశోక్ ఫులంబార్కర్, డా. ఇషితా గుప్తా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపికయ్యారు. అవార్డుల ఎంపికను 2026 AAPI అవార్డ్స్ కమిటీ చైర్ డా. వందనా అగర్వాల్ నేతృత్వంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించారు.
AAPI రూపకర్తగా డా. నవీన్ సి. షాకు ప్రత్యేక గౌరవం
AAPI స్థాపనలో కీలక పాత్ర పోషించిన డా. నవీన్ సి. షాకు "ఆర్కిటెక్ట్ ఆఫ్ AAPI అండ్ ఛాంపియన్ ఆఫ్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఈక్వాలిటీ అవార్డు" ప్రదానం చేశారు. 1982లో AAPI ఏర్పాటుకు ఆయన చేసిన కృషి, విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లపై వివక్ష నిర్మూలన కోసం సాగించిన ఉద్యమం, వైద్య విద్యాభివృద్ధికి చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తించారు.
అమెరికా, భారతదేశాల మధ్య వైద్య పరిశోధనల సహకారం, నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలు, ట్రామా శిక్షణ, ఆసుపత్రులకు వైద్య పరికరాల అందజేత వంటి అనేక కార్యక్రమాలకు ఆయన నాయకత్వం వహించారు.
వేటరన్ల సేవలో విశిష్ట కృషికి డా. అశోక్ ఫులంబార్కర్
పల్మనరీ మెడిసిన్‌లో నాలుగు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందించిన డా. అశోక్ ఫులంబార్కర్కు "లైఫ్‌టైమ్ సర్వీస్ టు వెటరన్స్ అండ్ పల్మనరీ మెడిసిన్" అవార్డు లభించింది.
కెప్టెన్ జేమ్స్ ఏ. లవెల్ ఫెడరల్ హెల్త్ కేర్ సెంటర్‌లో పల్మనరీ విభాగాధిపతిగా పనిచేసిన ఆయన 80 మందికి పైగా పల్మనరీ ఫెలోలను తీర్చిదిద్దారు. అమెరికాలో నివసించే భారతీయుల ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ఆయన చేసిన పరిశోధనలు వైద్యరంగంలో ప్రామాణికంగా గుర్తింపు పొందాయి. AAPI బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్‌గా కూడా ఆయన సేవలందించారు.
యువ వైద్య పరిశోధకురాలిగా డా. ఇషితా గుప్తాకు గుర్తింపు
MSRF అవార్డు – రైజింగ్ గ్లోబల్ వాయిస్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ను యువ వైద్యురాలు డా. ఇషితా గుప్తా అందుకున్నారు.
ఆర్కాన్సాస్‌లోని సెయింట్ బెర్నార్డ్స్ మెడికల్ సెంటర్‌లో చీఫ్ రెసిడెంట్‌గా పనిచేస్తున్న ఆమెకు ఇప్పటికే 45 శాస్త్రీయ పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. అమెరికా, భారత్, దుబాయ్, లండన్‌లలో వైద్య అనుభవాన్ని సంపాదించిన ఆమెకు ACP నేషనల్ అబ్స్ట్రాక్ట్ అవార్డు (2024), ACG అవుట్‌స్టాండింగ్ పోస్టర్ ప్రజెంటర్ అవార్డు (2025) సహా పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.
AAPI లక్ష్యం సేవ, సమానత్వం, నాయకత్వం
సదస్సులో మాట్లాడిన AAPI నాయకులు, ఈ అవార్డులు వ్యక్తిగత విజయాలకు మాత్రమే కాకుండా వైద్య సేవ, సమానత్వం, భవిష్యత్ నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.
అవుట్‌గోయింగ్ అధ్యక్షుడు డా. అమిత్ చక్రబర్తి మాట్లాడుతూ, "టాంపా సదస్సే AAPI అధికారిక వార్షిక మహాసభ. ఇదే నిజమైన వేదిక" అని అన్నారు.
AAPI అధ్యక్షుడు డా. మెహర్ మేడవరం మాట్లాడుతూ, "ఐక్యత, నిజాయితీ, సమగ్రతతో AAPIని మరింత బలోపేతం చేయడమే మా లక్ష్యం" అని తెలిపారు.
అవార్డ్స్ కమిటీ చైర్ డా. వందనా అగర్వాల్ మాట్లాడుతూ, "డా. నవీన్ షా, డా. అశోక్ ఫులంబార్కర్, డా. ఇషితా గుప్తా... ఈ ముగ్గురు AAPI గతం, వర్తమానం, భవిష్యత్తుకు ప్రతీకలు. వారి సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి" అని పేర్కొన్నారు.
టాంపా మేయర్ జేన్ క్యాస్టర్ విడుదల చేసిన ప్రకటనలో, అమెరికాలో ప్రతి ఏడు మంది రోగుల్లో ఒకరికి AAPI సభ్యులే వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొంటూ, అమెరికా ఆరోగ్య రంగంలో భారతీయ మూలాల వైద్యుల సేవలను కొనియాడారు.










