అమెరికాలోని డల్లాస్‌లో BRS MLC తక్కెళ్లపల్లి రవీందర్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాసులు, ప్రవాసులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న తక్కెళ్లపల్లి రవీందర్‌రావు కేక్ కట్ చేసి, తన జన్మదిన వేడుకలను నిర్వహించిన ప్రవాసులకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం తెలంగాణ ప్రవాసులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమాన్ని, నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి ముందుకు తీసుకెళ్లారని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న వివక్షను ఆయన ప్రస్తావించారు. కృష్ణా, గోదావరి నదులు ఉన్నప్పటికీ తాగు, సాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. చెరువులు, కుంటలు, కాలువల నిర్వహణ సరిగా లేకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు కిలోమీటర్ల మేర నడిచేవారని గుర్తుచేశారు.
విద్యుత్ కోతలు, మోటార్లు కాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల పరిస్థితిలో మార్పు వచ్చిందని, వ్యవసాయం మరింత లాభసాటిగా మారిందని అన్నారు. 2014లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన తన జీవితంలో గొప్ప విజయమని రవీందర్‌రావు అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొనసాగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా ఆయన తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్ర రాజకీయాలపై తన అభిప్రాయాలను ప్రవాస తెలంగాణ ప్రజలతో పంచుకున్నారు.


















