ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బాలల సంక్షేమం, కుటుంబ న్యాయస్థాన సేవలు, గృహహింస, వృద్ధుల సంక్షేమం, డయాలసిస్ సేవలు తదితర రంగాల్లో దశాబ్దాలుగా విశేష సేవలందించిన డా. భానుమతి ఇవటూరిని డాలస్‌లో జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించారు.

పార్క్‌ల్యాండ్ హాస్పిటల్, డాలస్ కౌంటీ ఫ్యామిలీ కోర్ట్ సర్వీసెస్, డాలస్ కౌంటీ చైల్డ్ వెల్ఫేర్ తదితర సంస్థలతో కలిసి పనిచేస్తూ అవసరమైన వారికి వ్యక్తిగతంగానూ, వివిధ సామాజిక సంస్థల ద్వారానూ డా. భానుమతి అండగా నిలిచారు.

ఈ సందర్భంగా IANT పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, షబ్నం మాడ్గిల్, తైయాబ్ కుండావాల, సుష్మా మల్హోత్రా, సత్యన్ కళ్యాణ్ దుర్గ్; TANTEX అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డితో పాటు పలువురు పూర్వాధ్యక్షులు; ATA ఉత్తరాధ్యక్షులు సతీష్ రెడ్డి; NATS పూర్వాధ్యక్షులు బాపు నూతి; TANA పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, బోర్డు పూర్వ కార్యదర్శి మురళి వెన్నం; కమ్యూనిటీ నాయకులు ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, డా. జగదీశ్వరన్ పుడూర్ తదితరులు డా. భానుమతిని సత్కరించారు.

సభాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “సమస్యకు–పరిష్కారానికి, వివాదానికి–అవగాహనకు, గందరగోళానికి–స్పష్టతకు, నిరాశకు–ఆశకు మధ్య డా. భానుమతి ఒక వెలుగుదారిగా నిలిచారు” అని ప్రశంసించారు.

అమెరికాలో కొత్త జీవితాన్ని నిర్మించుకునే క్రమంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య సాంస్కృతిక వ్యత్యాసాల కారణంగా ఏర్పడే అపార్థాలు, కుటుంబ సమస్యలను భానుమతి ఎంతో లోతుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. “తల్లిదండ్రుల ఆశలు, అంచనాల కారణంగా పిల్లలనే దూరం చేసుకునే పరిస్థితి రాకూడదు” అనే ఆమె ఆలోచన ఎంతో విలువైనదని అన్నారు.

జీవితంలో విజయం అంటే కేవలం డిగ్రీలు, పదవులు, బిరుదులు కాదని.. మన వల్ల ఎన్ని కుటుంబాలకు సహాయం అందింది, ఎంతమంది జీవితాలు మెరుగుపడ్డాయి అనేదే నిజమైన విజయానికి కొలమానమని ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు. దీనికి డా. భానుమతి జీవితం ప్రత్యక్ష ఉదాహరణ అని కొనియాడారు.

అమెరికాలో 50 సంవత్సరాలకు పైగా జీవిస్తూ, తొమ్మిది పదులు దాటిన వయస్సులో మాతృదేశంలో తన భావి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకోవడం అభినందనీయమని అన్నారు. ఆమె భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో సాగాలని అందరి తరఫున శుభాకాంక్షలు తెలిపారు.

ఇక వివిధ సందర్భాల్లో డా. భానుమతి ఇవటూరితో కలిసి పనిచేసిన ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, డా. కృష్ణబాబు చుండూరి, డా. కిశోర్ సుంకర, రాధికా కోడెల, రామకృష్ణ నూనె, డోరిస్ మార్షల్, స్యూ యాన్ రూత్, అవ్యం రమణి తదితరులు ఆమె సామాజిక సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా డా. భానుమతి ఇవటూరి మాట్లాడుతూ.. “అతి తక్కువ సమయంలో, వారాంతం కానప్పటికీ ఇర్వింగ్‌లోని మైత్రీ ఇండియన్ రెస్టారెంట్‌లో దాదాపు వంద మందికి పైగా ఆత్మీయ సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు” తెలిపారు.

తన జీవితంలో ఈ రోజు ఒక మధురమైన రోజుగా మిగిలిపోతుందని, తన సుదీర్ఘ సామాజిక సేవా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.