రుమటాలజిస్ట్, ఒబేసిటీ మెడిసిన్ ఫిజిషియన్, ‘Walk Beyond the White Coat’ వ్యవస్థాపకురాలు డా. ‘మాలిని’ దాసరితో ప్రత్యేక ఇంటర్వ్యూ.
మీ బాల్యం, కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి?
మాలిని: నేను దక్షిణ భారతదేశంలోని విశాఖపట్నంలో ఒక సంప్రదాయ కుటుంబంలో పెరిగాను. మా కుటుంబంలో విద్యకు చాలా ప్రాధాన్యం ఉండేది. నా తాతయ్య నాకు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు—“కలలు కనడం ఎప్పుడూ ఆపొద్దు.. నీపై నమ్మకం కోల్పోవద్దు.” ఆ మాటలు నా జీవితానికి ఎంతో బలం ఇచ్చాయి.
వైద్య రంగాన్నే ఎందుకు ఎంచుకున్నారు?
మాలిని: చిన్న వయసులోనే నా అమ్మమ్మను గుండెపోటుతో కోల్పోయాను. ఆమెను కాపాడలేకపోయామనే బాధ నాలో వైద్య రంగంపై ఆసక్తిని పెంచింది. ఆ తర్వాత డాక్టర్ కావాలనే లక్ష్యం మరింత బలపడింది.
రుమటాలజీని ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నారు?
మాలిని: రుమటాలజీ నాకు ఒక పజిల్ సాల్వ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. రోగి లక్షణాలు, చర్మంపై కనిపించే మార్పులు, ఇతర సంకేతాలను కలిపి అసలు సమస్యను గుర్తించడం నాకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
‘Walk Beyond the White Coat’ ఆలోచన ఎలా వచ్చింది?
మాలిని: డాక్టర్ బాధ్యత ఆసుపత్రి లేదా క్లినిక్ గోడలకే పరిమితం కాకూడదని నేను నమ్ముతాను. నా జ్ఞానాన్ని మరింత మందికి ఉపయోగపడేలా చేయాలనిపించింది. అందుకే కమ్యూనిటీ సర్వీస్, మహిళల ఆరోగ్యం, యువతకు మార్గదర్శకత్వం వంటి కార్యక్రమాల్లో భాగమయ్యాను.
యువత, ముఖ్యంగా అమ్మాయిల కోసం మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి?
మాలిని: యువతుల్లో ఆత్మవిశ్వాసం పెంచడం నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు మెంటర్‌గా ఉండటం, వారికి జీవితంపై నమ్మకం కల్పించడం నా లక్ష్యం.
డాక్టర్‌గానే కాకుండా ఫ్యాషన్, పేజెంట్స్‌లోనూ కనిపిస్తారు. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?
మాలిని: నాకు డాక్టర్‌గానూ ఉండటం ఇష్టం.. ఫ్యాషన్ కూడా ఇష్టం. Beauty and brains రెండింటినీ ఉపయోగించి సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. ఒక రంగంలో ఉన్నాం కాబట్టి మరో రంగాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు.
35 ఏళ్ల తర్వాత మహిళల కెరీర్‌కు పరిమితులు ఉంటాయని భావిస్తారా?
మాలిని: అసలు కాదు. వయసు మన కలలకు అడ్డంకి కాకూడదు. ముఖ్యంగా మహిళలు ఒక నిర్దిష్ట వయసు తర్వాత తమ కలలను వదులుకోవాల్సిన అవసరం లేదని నేను నమ్ముతాను.
సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను ఎలా ఎదుర్కొంటారు?
మాలిని: ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. గతంలో వాటిని ఎక్కువగా పట్టించుకునేదాన్ని. ఇప్పుడు నాకు అవసరమైనదాన్ని మాత్రమే తీసుకుంటాను. మిగతావి వదిలేస్తాను.
మహిళలు తమ ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మాలిని: మహిళలు అందరి గురించి ఆలోచించే ముందు తమ గురించి కూడా ఆలోచించాలి. “Fill your cup first” అనేది నా నమ్మకం. రెగ్యులర్ హెల్త్ చెకప్స్, సరైన ఆహారం, వ్యాయామం, మానసిక ఆరోగ్యం—అన్నింటికీ ప్రాధాన్యం ఇవ్వాలి.
మీ రోజువారీ రొటీన్ ఎలా ఉంటుంది?
మాలిని: సాధారణంగా ఉదయం 5 గంటల ప్రాంతంలో నిద్రలేస్తాను. జర్నలింగ్, మెడిటేషన్‌తో రోజును ప్రారంభిస్తాను. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో చియా సీడ్స్, నిమ్మరసం తీసుకుంటాను. సూర్య నమస్కారాలు, అప్పుడప్పుడు రన్నింగ్, వారంలో మూడు రోజులు రీఫార్మర్ పైలేట్స్ చేస్తాను.
మానసిక ఆరోగ్యం గురించి మీ సందేశం?
మాలిని: మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటం బలహీనత కాదు. మనకు ఇష్టమైన పనులు చేయడం మానేయడం, అందరి నుంచి దూరంగా ఉండటం, ఆహారాన్ని భావోద్వేగాలకు పరిష్కారంగా ఉపయోగించడం వంటి మార్పులు కనిపిస్తే సహాయం తీసుకోవాలి.
ఒబేసిటీ మెడిసిన్ వైపు ఎందుకు వచ్చారు?
మాలిని: ఊబకాయం అనేది పెరుగుతున్న పెద్ద ఆరోగ్య సమస్య. ముఖ్యంగా అమెరికాలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఊబకాయం వల్ల అనేక ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో ఈ రంగంలో పనిచేయాలనిపించింది.
అమెరికాకు మీ ప్రయాణం ఎలా సాగింది?
మాలిని: అమెరికాకు వచ్చినప్పుడు నా దగ్గర సుమారు $2,000 మాత్రమే ఉన్నాయి. కొత్త దేశం.. కొత్త జీవితం.. ఎన్నో సవాళ్లు. కొన్ని నెలల పాటు ఉండటానికి సరైన స్థలం కూడా లేకపోయింది. రైలు స్టేషన్లు, హాస్పిటల్ లాబీల్లో గడిపిన రోజులు ఉన్నాయి. కానీ ఆ కష్టాలే నన్ను మరింత బలంగా తీర్చిదిద్దాయి.
అమెరికాలో వైద్య విద్యా ప్రయాణం ఎలా సాగింది?
మాలిని: అమెరికాకు వైద్య విద్యను మరింత ముందుకు తీసుకెళ్లాలనే కలతో వచ్చాను. ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సీ పూర్తి చేసి, ఆ తర్వాత రుమటాలజీలో ఫెలోషిప్ చేశాను. ఆ తర్వాత వైద్యురాలిగా పనిచేస్తూ కమ్యూనిటీకి సేవ చేయడం ప్రారంభించాను.
మీ కుటుంబం మీ ప్రయాణానికి ఎలా అండగా నిలిచింది?
మాలిని: నా భర్త డా. సతీష్ కాడి ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. మాకు ఇద్దరు కుమార్తెలు. వాళ్లు కూడా నా ప్రయాణాన్ని గర్వంగా చూస్తారు. ఇద్దరు అమ్మాయిలను పెంచుతూ వారికి ఒక ఉదాహరణగా నిలవడం నాకు చాలా సంతోషం.
‘సక్సెస్‌ఫుల్ మహిళలకు అన్నీ సులభంగానే వచ్చాయి’ అనుకోవచ్చా?
మాలిని: అస్సలు కాదు. బయట నుంచి ఒక మహిళ విజయాన్ని చూస్తే ఆమె ప్రయాణం సులభంగా అనిపించొచ్చు. కానీ ప్రతి మహిళ వెనుక ఎన్నో సవాళ్లు ఉంటాయి. గుర్తింపు కోసం మహిళలు చాలా సందర్భాల్లో మరింత కష్టపడాల్సి వస్తుంది.
మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన మాట ఏది?
మాలిని: నా తాతయ్య చెప్పిన “Never stop dreaming and never stop believing in yourself” అనే మాట. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు వచ్చినా ఆ మాట నన్ను ముందుకు నడిపించింది.
చివరగా మహిళలకు మీ సందేశం?
మాలిని: మీ పరిస్థితులు మిమ్మల్ని నిర్వచించనివ్వకండి. మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. మీ కలలను వదులుకోవద్దు. అవసరమైతే మీ కథను మీరే తిరిగి రాయండి. తెల్ల కోటు ఒక ప్రారంభం మాత్రమే.. మన జ్ఞానం, మన సామర్థ్యం సమాజానికి ఉపయోగపడేలా చేయడమే అసలు లక్ష్యం.














