హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ ప్రతిష్టాత్మక స్వర్ణోత్సవ మహాసభలు–2026 ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. తెలుగు ఐక్యతకు 50 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ 2026–27 నూతన కార్యవర్గం భారత కాన్సుల్ జనరల్ డి.సి. మంజునాథ్ను మర్యాదపూర్వకంగా కలిసింది. అధ్యక్షులు యాదగిరి రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధులు, ప్రముఖులు చార్లీ చౌదరితో కలిసి ప్రవాసంలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ, తెలుగు సమాజ ఐక్యత, భావితరాల్లో మాతృభాషపై అభిమానం పెంపొందించే అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆగస్టు 7, 8 తేదీల్లో జరగనున్న హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ స్వర్ణోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కాన్సుల్ జనరల్‌ను అధికారికంగా ఆహ్వానించారు. ప్రపంచ వేదికపై తెలుగు సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పేలా ఈ 50 ఏళ్ల వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ కట్టుబడి ఉందని నిర్వాహకులు స్పష్టం చేశారు.
మహాసభలను విజయవంతం చేసేందుకు 30 ప్రత్యేక కమిటీలు, 150 మందికి పైగా వాలంటీర్లు గత మూడు నెలలుగా నిరంతరం శ్రమిస్తున్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రతి తెలుగు కుటుంబానికి మరపురాని అనుభూతిని అందించాలనే లక్ష్యంతో అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి.
హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు యాదగిరి రెడ్డి, కన్వీనర్ జితేందర్ రెడ్డి నేతృత్వంలో కన్వెన్షన్ కోర్ టీమ్ సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తోంది. ఫోర్ట్ బెండ్ ఎపిసెంటర్ వేదికగా జరిగే ఈ చారిత్రక వేడుకలు "50 సంవత్సరాల సేవ... తెలుగు ఐక్యతకు స్వర్ణయుగ వేడుక!" అనే నినాదంతో నిర్వహించబడుతున్నాయి. ఈ మహాసభల్లో ప్రతి తెలుగు కుటుంబం భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.














