న్యూజెర్సీలో తెలుగు సంగీతాభిమానులకు మరపురాని అనుభూతిని అందించేలా ఐడీఓఎల్ గంధర్వ ఘంటసాల అసోసియేషన్ (IGGA) ఆధ్వర్యంలో ‘ప్రప్రథమ సంగీత మహోత్సవము’ ఘనంగా జరిగింది. ఫోర్డ్స్‌లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో తెలుగు సంగీత ప్రియులు హాజరయ్యారు.
సాయంత్రం నుంచి రాత్రి వరకు సాగిన ఈ సంగీత మహోత్సవం ఘంటసాల స్వరాలు, అన్నమయ్య కీర్తనలు, లైవ్ మ్యూజిక్‌తో సంగీత విందుగా మారింది. చిన్నారుల అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ కూచిపూడితో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకకు మరింత శోభను తీసుకొచ్చాయి.
అన్నమయ్య శ్రీ పాదార్చన, ‘ఘంటసాల స్వర’, సంగీత నృత్య హేళ, IGGA రైజింగ్ స్టార్ సింగింగ్ ప్రోగ్రామ్, లైవ్ మ్యూజిక్, బుర్రకథ వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. చిన్నారులు, యువ కళాకారులు తమ ప్రతిభను చాటుకోవడంతో ప్రాంగణం కరతాళధ్వనులతో మార్మోగింది.
ప్రముఖ గాయకులు, నృత్య కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలతో పాటు ఘంటసాల సంగీత వైభవాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది.
ఈ వేడుకకు ఎడిసన్ మేయర్ సామ్ జోషి, కమిషనర్ ఎమెరిటస్ ఉపేంద్ర చివుకుల, సముద్రా, ఇంక్. సీఈఓ మంగేష్ చింతమనేని, ఐజీజీఏ వ్యవస్థాపకుడు శరత్ చంద్ర తదితరులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ ప్రొఫెషనల్ సింగర్ అనితా కృష్ణ, నటుడు, కూచిపూడి కళాకారుడు ఇంద్రనీల్ వర్మ, ప్రొఫెషనల్ కూచిపూడి నర్తకి వర్షిణి అర్జా, సాయి దత్త పీఠం వ్యవస్థాపకుడు, సీఈఓ రఘు శంకరమంచి తదితరులు పాల్గొన్నారు.
దాము గెదెల, ప్రసాద్ వూటుకూరు, పూర్ణిమ గిర్కల, మధులత పంత్రంగి, ఈశ్వరి లుకులపు, శివశంకర్ కనారెమేడల, ఎం.వి. రావు తదితర ఐజీజీఏ నాయకత్వ బృందం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. అమెరికాలోని భావితరాలకు తెలుగు సంగీతం, సాహిత్యం, నృత్యం, సంస్కృతిని పరిచయం చేయడంతో పాటు చిన్నారులు, యువ కళాకారులను ప్రోత్సహించడమే IGGA లక్ష్యమని తెలిపారు.
మొత్తంగా సంగీతం, నృత్యం, సాంస్కృతిక ప్రదర్శనల సమ్మేళనంగా సాగిన ‘ప్రప్రథమ సంగీత మహోత్సవము’ న్యూజెర్సీ తెలుగు సమాజానికి అద్భుతమైన సాంస్కృతిక విందును అందించింది.













