ఉత్తర అమెరికా తెలుగు సమాజం (NATS) ఆధ్వర్యంలో అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రవాసులకు ఇమ్మిగ్రేషన్ అంశాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన "Ask an Attorney" ప్రత్యేక ఆన్‌లైన్ సెషన్ విజయవంతంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అటార్నీ భాను ఇలింద్ర (BBI Law Group) ముఖ్య వక్తగా పాల్గొని అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలు, తాజా పరిణామాలు, వీసా నిబంధనలపై సమగ్రంగా వివరించారు.
సెషన్‌లో "Know Your Rights" అంశంపై అమెరికాలో ప్రతి వలసదారు తెలుసుకోవాల్సిన చట్టపరమైన హక్కులను వివరించారు. అలాగే ICE (Immigration and Customs Enforcement) అధికారులతో వ్యవహరించే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, చేయాల్సినవి–చేయకూడనివి గురించి స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
అదేవిధంగా H-1B 2026 ఫైలింగ్స్‌కు సంబంధించిన కీలక అంశాలు, తాజా మార్పులు, దరఖాస్తు ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, పాల్గొన్నవారి సందేహాలకు సమాధానాలు అందించారు. అనంతరం నిర్వహించిన General Immigration Open Q&A సెషన్‌లో వీసాలు, గ్రీన్ కార్డ్, స్టేటస్ మార్పులు తదితర ఇమ్మిగ్రేషన్ అంశాలపై అడిగిన ప్రశ్నలకు భాను ఇలింద్ర సమగ్రంగా వివరణ ఇచ్చారు.
అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసులు ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. చట్టపరమైన అవగాహన పెంపొందించడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
అమెరికాలోని తెలుగు సమాజానికి ఇమ్మిగ్రేషన్ సహా వివిధ అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను NATS భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.











