అమెరికాలో జరుగుతున్న మాటా (MATA) 2వ కన్వెన్షన్-2026లో టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మహాసభల్లో భాగంగా టుడే తెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ప్రవాస తెలుగు సంఘాల పాత్రను ప్రశంసించారు.

మాటా వంటి సంస్థలు విదేశాల్లో తెలుగు భాష, సంస్కృతిని భావితరాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నిఖిల్ అన్నారు. ముఖ్యంగా అమెరికాలో పెరుగుతున్న యువత తమ మూలాలను గుర్తుంచుకుని, తెలుగు భాషా సంస్కృతులను గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

తెలుగు సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని, దానిని మరింత ఉన్నత స్థాయికి చేర్చేందుకు యువత ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి కన్వెన్షన్లు తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

మాటా కన్వెన్షన్‌లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, నిర్వాహకులు అద్భుతమైన ఏర్పాట్లు చేశారని నిఖిల్ అభినందించారు. తెలుగు వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్న మాటా సంస్థకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.