అమెరికాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఘనంగా చాటిచెప్పే తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (TPAD) ఈ ఏడాది బతుకమ్మ–దసరా సంబరాలను మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఏటా వేలాది మంది తెలుగువారితో బతుకమ్మ వేడుకలను నిర్వహించే టీపాడ్.. ఈసారి ప్రత్యేక కార్యక్రమాలతో పండుగను మరింత మెమొరబుల్‌గా మార్చనుంది.
ఈ వేడుకలకు సంబంధించి సెప్టెంబర్ 12న ప్లానోలోని Elegance Ballroom & Event Centerలో కిక్‌ఆఫ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. సాయంత్రం 7 గంటల నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో రాబోయే బతుకమ్మ–దసరా సంబరాల ఏర్పాట్లు, ప్రత్యేక కార్యక్రమాల వివరాలను నిర్వాహకులు వెల్లడించారు.
ఇక ఈ ఏడాది ప్రధాన బతుకమ్మ–దసరా వేడుకలను అక్టోబర్ 17న శనివారం, ఫ్రిస్కోలోని Comerica Centerలో మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ప్రముఖ నటుడు నవీన్ పొలిశెట్టి లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే Infusion Band కూడా తమ సంగీత ప్రదర్శనతో సందడి చేయనుంది.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మతో పాటు దసరా సంబరాలను అమెరికాలోని తెలుగు కుటుంబాలు కలిసి జరుపుకునేలా టీపాడ్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ వేడుకల నిర్వహణలో టీపాడ్ అధ్యక్షురాలు లక్ష్మి పొరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ–చైర్ రవికాంత్ మామిడి, కోఆర్డినేటర్ లింగారెడ్డి ఆల్వా, ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు కీలకంగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ పల్లె సంస్కృతిని అమెరికా గడ్డపై ప్రతిబింబించేలా.. బతుకమ్మ, దసరా సంబరాలను పాటలు, సంగీతం, వినోదంతో కలిపి భారీ స్థాయిలో నిర్వహించేందుకు టీపాడ్ రెడీ అయింది.
















