తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణపై చర్చిస్తూ తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ అంతర్జాతీయ అంతర్జాల సమావేశం విజయవంతంగా జరిగింది. గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్ర భాషా దినోత్సవం సందర్భంగా “తెలుగే మన వెలుగు” అనే అంశంపై ఈ సమావేశాన్ని నిర్వహించారు.

తానా సాహిత్య విభాగం ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరుతో ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జరిగిన 95వ సమావేశం సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమై ఉత్సాహంగా కొనసాగింది.

ముఖ్యఅతిథి, కీలకోపన్యాసకుడిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. తెలుగు భాష పరిరక్షణ, పరివ్యాప్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలుగు భాష అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో సలహా కమిటీ ఏర్పాటు చేసి తగిన విధివిధానాలను రూపొందిస్తామని తెలిపారు.

తెలుగు భాషకు విశేష సేవలందించిన మహనీయులను భావితరాలు గుర్తుంచుకునేలా చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. తన ఉండి ప్రాంతానికి చెందిన తిరుపతి వెంకట కవులలో ఒకరైన తిరుపతిశాస్త్రి, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జికి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టనున్నట్లు తెలిపారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఆంగ్ల భాష ప్రాధాన్యతను గుర్తిస్తూనే తెలుగు భాషను కాపాడుకోవడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ తెలుగును విస్తృతంగా ఉపయోగించాలని, ఆంగ్లంలో వెలువడే ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే తెలుగులోకి అనువదించే విధానం ఉండాలని సూచించారు. కనీసం ఐదో తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆచార్య డా. శలాక రఘునాధ శర్మ మాట్లాడుతూ.. ఎన్ని భాషల పదాలనైనా తనలో మిళితం చేసుకోగల గొప్ప శక్తి తెలుగు భాషకు ఉందన్నారు. శ్రీకృష్ణదేవరాయలతో పాటు పలువురు పరభాషీయులు, విదేశీయులు తెలుగు భాషా వైభవాన్ని ప్రశంసించారని గుర్తుచేశారు. తెలుగు భాష విస్తరణ విషయంలో నిర్లక్ష్యం తగదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ళ మల్లికార్జునరావు మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతుల కోసం కృషి చేస్తున్న వారికి ప్రతి సంవత్సరం తెలుగు భాషా పురస్కారాలు, కళారత్న పురస్కారాలు అందిస్తున్నామని తెలిపారు.

గిడుగు రామమూర్తి పంతుల మునిమనుమరాలు గిడుగు లక్ష్మీకాంతికృష్ణ మాట్లాడుతూ.. ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని గిడుగు రామమూర్తి పంతులు గ్రాంధిక భాషను ప్రజలకు చేరువైన వ్యవహారిక భాషగా తీర్చిదిద్దారని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ గిడుగు రామమూర్తి ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం భాషా, సాహిత్య వికాసానికి కృషి చేస్తున్న వారికి పురస్కారాలు అందిస్తున్నామని చెప్పారు.

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు డా. మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. తెలుగుకు ప్రాచీన భాష హోదా సాధించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందడంలో ఇంకా వెనుకబడి ఉన్నామని తెలిపారు. ఈ విషయంలో పార్లమెంట్ సభ్యుల సహకారం అవసరమన్నారు.

తెలుగు భాషోద్యమ సమాఖ్య కార్యదర్శి డా. గుంటుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పిల్లలకు తెలుగు నేర్పించేందుకు ఆధునిక పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం మార్కులకే పరిమితం కాకుండా పిల్లలకు భాష ఎంతవరకు అర్థమవుతోంది, ఉపయోగించగలుగుతున్నారో పరిశీలించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో భాషా బోధనలో మార్పులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

సీనియర్ జర్నలిస్ట్ రమేశ్ కందుల మాట్లాడుతూ.. కాలానుగుణంగా తెలుగు భాష అన్ని రంగాల్లోనూ అనేక మార్పులకు లోనవుతోందన్నారు. తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అతిథులు, సాహితీవేత్తలు, నిర్వాహకులు, సాంకేతిక బృందానికి డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలిపారు.