అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో మేరీల్యాండ్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నమెంట్‌కు విశేష స్పందన లభించింది. క్రీడా స్ఫూర్తి, సోదరభావం, ఆనందోత్సాహాల నడుమ జరిగిన ఈ పోటీల్లో టెన్నిస్ క్రీడాభిమానులు, ప్రవాస తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ టోర్నమెంట్‌కు ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా కోర్ టీమ్ సభ్యులు, కమిటీ చైర్మన్లు, వివిధ తెలుగు సంఘాల నాయకులు హాజరై ఆటగాళ్లను ప్రోత్సహించారు. వారి సమక్షం కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చింది.
అన్ని వయసుల క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ హోరాహోరీగా తలపడగా, కుటుంబ సభ్యులు, స్నేహితులు వారికి మద్దతుగా నిలిచి క్రీడా వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు.
పోటీల ముగింపు సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో విజేతలు, రన్నరప్‌లు మరియు పాల్గొన్న క్రీడాకారులను ట్రోఫీలు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు.
ఈ టోర్నమెంట్ కేవలం క్రీడా పోటీగానే కాకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ తెలుగు కమ్యూనిటీ సభ్యుల మధ్య స్నేహబంధాలను మరింత బలోపేతం చేసింది. అదే సమయంలో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్‌లో జరగనున్న 19వ ఆటా మహాసభలపై ప్రవాస తెలుగువారిలో మరింత ఆసక్తి, ఉత్సాహాన్ని నింపింది.
టోర్నమెంట్ విజయవంతం కావడంలో కృషి చేసిన విజేతలు, క్రీడాకారులు, నిర్వాహకులు, వాలంటీర్లు, మద్దతుదారులందరికీ ఆటా కోర్ టీమ్ అభినందనలు తెలియజేసింది. ముఖ్యంగా అద్భుతమైన ప్రణాళిక, సమన్వయం, ఆతిథ్యంతో కార్యక్రమాన్ని ఘన విజయవంతం చేసిన మేరీల్యాండ్ టీమ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.




















