అమెరికాలోని భారతీయ సమాజాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) యూఎస్ఏ మరో కీలక ముందడుగు వేసింది. మిచిగన్ రాష్ట్రంలో నూతనంగా “మిచిగన్ స్టేట్ చాప్టర్” ఏర్పాటు చేయనున్నట్లు ఐఓసి నాయకులు ప్రకటించారు. ఈ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జూన్ 26, 2026న ఫార్మింగ్టన్ హిల్స్ నగరంలో ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా మిచిగన్ చాప్టర్ నిర్వాహకుడు శ్రీధర్ పటేల్ మాట్లాడుతూ, అమెరికాలోని భారతీయులు, ముఖ్యంగా తెలుగు మరియు భారతీయ మూలాల ప్రజలను ఒక వేదికపైకి తీసుకురావడం, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడం, భారతీయ విలువలను తదుపరి తరాలకు చేరవేయడం ఈ చాప్టర్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఫార్మింగ్టన్ హిల్స్‌లోని సెయింట్ థామస్ హాల్ (St. Thomas Hall) లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ గ్లోబల్ చైర్మన్ సామ్ పిట్రోడా, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారు.

అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేక జూమ్ సందేశం ద్వారా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఐఓసి యూఎస్ఏ అధ్యక్షుడు మోహిందర్ సింగ్ గిల్‌జియన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ సామల సహా పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు ఈ వేడుకలో పాల్గొని మిచిగన్ చాప్టర్‌కు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.

భారతీయ సమాజ అభివృద్ధి, యువతలో నాయకత్వ లక్షణాల పెంపు, భారత-అమెరికా సాంస్కృతిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై ఈ చాప్టర్ కీలక పాత్ర పోషిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. మిచిగన్ రాష్ట్రంలోని భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీధర్ పటేల్ పిలుపునిచ్చారు.

ioc flayer.webp