మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ – మాటా రెండో కన్వెన్షన్ విజయోత్సవం మరో ఆత్మీయ కార్యక్రమానికి వేదికైంది. రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన మాటా సెకండ్ కన్వెన్షన్‌ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన కన్వెన్షన్ కమిటీ సభ్యులు, వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ ప్రత్యేకంగా వాలంటీర్ అప్రిషియేషన్ డిన్నర్ నిర్వహించారు.

పెన్సిల్వేనియాలోని థోర్న్‌డేల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందంగా గడిపారు. మహాసభ విజయానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి వాలంటీర్‌కు మాటా నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి సేవా భావాన్ని ప్రత్యేకంగా అభినందించింది.

ఈ కార్యక్రమంలో మాటా అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దగి, వ్యవస్థాపకుడు & ఏసీ సభ్యుడు శ్రీనివాస్ గనగోని, కన్వీనర్ శ్రీధర్ గుడాల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గుడూరు, కోఆర్డినేటర్ కళ్యాణి బెల్లంకొండ, స్పిరిచువల్ & మెంబర్‌షిప్ డైరెక్టర్ శిరీష గుండపునేని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు మల్లిక్ రావు బొల్లా, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానాతో పాటు పలువురు మాటా నాయకులు పాల్గొని, వాలంటీర్ల సేవలను ప్రత్యేకంగా అభినందించారు.

కన్వెన్షన్ విజయానికి తోడ్పడిన వాలంటీర్లు, స్పాన్సర్లు, దాతలు, మీడియా భాగస్వాములు, సాంస్కృతిక సమన్వయకర్తలకు మాటా నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. "సేవ – సంస్కృతి – సమానత్వం" అనే మాటా నినాదాన్ని ప్రతిబింబిస్తూ ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.