అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ (IBA) ఆధ్వర్యంలో 22వ వార్షిక ఇండియా డే పరేడ్–2026 ఘనంగా నిర్వహించారు. ఇసెలిన్‌లోని వుడ్‌బ్రిడ్జ్ నుంచి ఎడిసన్‌లోని ఓక్‌ట్రీ రోడ్ వరకు సాగిన ఈ శోభాయాత్రలో వేలాది మంది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి సాన్యా మల్హోత్రా, నటుడు అభిమన్యు దస్సాని, గాయని రిచా అనిరుద్, పంజాబీ కళాకారుడు డా. లక్ష్యరాజ్ సింగ్, గాయకుడు మోనాంక్ పటేల్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారి ప్రదర్శనలు, సందేశాలతో వేడుకలకు మరింత ఉత్సాహం వచ్చింది.
భారత త్రివర్ణ పతాకాలతో అలంకరించిన శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని తమ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించారు. కమ్యూనిటీ సంస్థలు, వ్యాపారవేత్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పరేడ్ సందడిగా సాగింది.
పరేడ్ అనంతరం ఉమియాధామ్ టెంపుల్ వెనుకభాగంలో భారీగా కల్చరల్ ఫెస్ట్ & మేళా నిర్వహించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, నృత్యాలు, భారతీయ వంటకాల స్టాళ్లు, కుటుంబ వినోద కార్యక్రమాలతో ఈ వేడుకలు ఆకట్టుకున్నాయి.
భారతీయుల ఐక్యత, సంస్కృతి, దేశభక్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ ఇండియా డే పరేడ్‌లో వేలాది మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. భారత వైవిధ్యంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలతో న్యూజెర్సీ అంతటా భారత స్వాతంత్య్ర వేడుకల సందడి కనిపించింది.















