అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాలు – వనభోజనాల వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నార్త్‌వెస్ట్ అర్కాన్సాస్ తెలంగాణ అసోసియేషన్ (NWATA) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జూలై 26 (ఆదివారం) న బెంటన్ కౌంటీ ఫెయిర్ గ్రౌండ్స్, బెంటన్‌విల్లేలో జరగనున్నాయి. ఈ సంస్థ తెలంగాణ సంస్కృతిని పరిరక్షిస్తూ స్థానిక తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా 2024లో స్థాపించబడింది.
ఉదయం 10 గంటలకు అమ్మవారి పూజలు ప్రారంభమవుతాయి. అనంతరం భక్తులు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించనుండగా, ఆ తర్వాత వనభోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ వేడుకలకు ప్రవేశం పూర్తిగా ఉచితం. తెలంగాణ సంస్కృతి, ఆచారాలను అమెరికాలోని కొత్త తరానికి పరిచయం చేయడమే కాకుండా, తెలుగు కుటుంబాల మధ్య స్నేహబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని NWATA పేర్కొంది.














