అమెరికాలోని న్యూజెర్సీలో Sanathan Inc. ఆధ్వర్యంలో నిర్వహించిన "హర హర మహాదేవ" గ్రాండ్ తెలుగు లైవ్ డివైన్ డ్రామా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. జూలై 10న న్యూజెర్సీలోని ఎడిసన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు కుటుంబాలు, ఆధ్యాత్మిక భక్తులు, కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఆగస్టు 1, 2026న న్యూజెర్సీ, ఈస్ట్ బ్రన్స్‌విక్‌లోని JMPAC వేదికగా నిర్వహించనున్న "హర హర మహాదేవ" గ్రాండ్ తెలుగు లైవ్ డివైన్ డ్రామా విశేషాలను వెల్లడించారు.
శివపురాణంలోని లింగోద్భవం, దక్ష యజ్ఞం, పార్వతి కళ్యాణం, గంగావతరణం, గజాసుర సంహారం, రావణ దర్పభంగం వంటి ఘట్టాలను అత్యాధునిక రంగస్థల రూపకల్పనతో ఆవిష్కరించనున్నారు. అలాగే 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొనే ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేయనున్నారు.
Sanathan Inc. వ్యవస్థాపకులు శేషగిరి రావు కంభమ్మెట్టు, సురేష్ కాజానా, డైరెక్టర్లు సరిత కంభమ్మెట్టు, శ్యామల కాజానా మాట్లాడుతూ, మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 1న జరిగే ఈ ఆధ్యాత్మిక మహోత్సవానికి తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
















