తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్న నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (NATS).. దివ్యాంగులు, అనాథలు, వెన్నెముక గాయాలతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా పలు సేవా కార్యక్రమాలను చేపడుతోంది.
సెప్టెంబర్ 20న నిడదవోలులోని హృదయాలయం ప్రత్యేక పాఠశాల, పునరావాస కేంద్రాన్ని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ రాజ్ అల్లాడ, న్యూజెర్సీ చాప్టర్ కో-ఆర్డినేటర్ సాయి గంగుల సందర్శించారు. ఈ సందర్భంగా నూతన భవనం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను వారు ప్రారంభించారు.
ఎన్‌ఆర్‌ఐల సహకారంతో హోప్ 4 స్పందన ఆధ్వర్యంలో నిర్మించిన ఈ నూతన భవనాన్ని 2026 ఆగస్టు 27న ప్రారంభించారు. భవన నిర్మాణానికి నాట్స్ 10,000 అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించింది.
ఈ సందర్భంగా కిషోర్ కంచర్ల, రాజ్ అల్లాడ మానసిక వైకల్యంతో ఉన్న చిన్నారులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. వారికి అందుతున్న పునరావాసం, బ్రిడ్జి కోర్సులు, ఫిజియోథెరపీ సేవలను పరిశీలించారు. చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేసి.. కేంద్రంలో అందుతున్న సేవలు, సదుపాయాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లోని దివ్యాంగులకు సైతం ఇలాంటి సేవలను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని నాట్స్ ప్రతినిధులు తెలిపారు. దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాల్లోనూ నాట్స్ భాగస్వామ్యం అవుతోంది.
ఇందులో భాగంగా తొర్రేడు గ్రామంలో గోపికి, వెంకటానగర్‌లో దేవదాసు చినబాబుకు కేటాయించిన కిరాణా దుకాణాలకు నాట్స్ ఒక్కొక్కరికి రూ.1.30 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఈ రెండు దుకాణాలను కిషోర్ కంచర్ల, రాజ్ అల్లాడ, సాయి గంగుల ప్రారంభించారు.
వెన్నెముకకు గాయాలై మంచానికే లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన బాధితులకు హోప్ 4 స్పందన ప్రతి నెలా అందిస్తున్న మెడికల్ కిట్ల పంపిణీకి కూడా నాట్స్ సహకరిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్ అల్లాడ ఈ కిట్లను పరిశీలించారు.
ఈ మెడికల్ కిట్లలో యూరినల్ బ్యాగులు, డైపర్లు, క్యాథిటర్లు, కాటన్ రోల్స్, బెటాడిన్, డెటాల్, గ్లౌజులు తదితర 13 రకాల అత్యవసర వైద్య సామగ్రి ఉన్నాయి.
అలాగే అనంతపురంలోని ఆశ్రయ అనాథ ఆశ్రమం, హైదరాబాద్ నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో శాశ్వత వసతి గృహాల ఏర్పాటుకు కూడా నాట్స్ ఆర్థిక సహకారం అందిస్తోంది.
ఈ సేవా కార్యక్రమాలన్నింటినీ హోప్ 4 స్పందన ఆంధ్ర–తెలంగాణ కో-ఆర్డినేటర్ డాక్టర్ రఘు ఆరికపూడి సమన్వయంతో నిర్వహిస్తున్నారు.
నిడదవోలు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ సామాజిక సేవా కార్యక్రమాల్లో హృదయాలయం వ్యవస్థాపకులు డాక్టర్ గణేష్ బాబు, ఆర్గనైజర్ డాక్టర్ బలగం విశాలక్ష్మి, దయ్యాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సేవా కార్యక్రమాలకు విశేషంగా సహకరిస్తున్న ప్రవాస భారతీయులకు నాట్స్ నాయకత్వం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.














