అమెరికాలో మరో భారీ తెలుగు సంబరానికి రంగం సిద్ధమైంది. జూన్ 19, 20 తేదీల్లో గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్‌లో ‘మాటా’ (మన అమెరికన్ తెలుగు అసోసియేషన్) రెండో మహాసభలు వైభవంగా జరగనున్నాయి. అమెరికా నలుమూలల నుంచి 5 వేల నుంచి 7 వేల మంది వరకు తెలుగు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సమాజ సేవ, యువత నాయకత్వం, కమ్యూనిటీ ఐక్యతను ప్రతిబింబించేలా రెండు రోజుల పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక, వ్యాపార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహాసభలకు ముఖ్య అతిథిగా ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద హాజరుకానుండగా.. సుమ కనకాల, ఐశ్వర్య రాజేష్, అలి, నిఖిల్, స్వాతి రెడ్డి తదితర సినీ, టెలివిజన్ ప్రముఖులు పాల్గొననున్నారు.

వినోద కార్యక్రమాల్లో భాగంగా రామ్ మిరియాల సంగీత విభావరి, దేవి శ్రీ ప్రసాద్ గ్రాండ్ ఫినాలే కాన్సర్ట్ ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. అలాగే భద్రాచల శ్రీ సీతారామ కళ్యాణం, యూత్, బిజినెస్, పాలిటికల్, లీగల్ ఫోరంలతో పాటు ఏఐ హ్యాకథాన్, సింగింగ్ స్టార్ పోటీలు కూడా నిర్వహించనున్నారు.

100కు పైగా వ్యాపార, ప్రదర్శన స్టాళ్లతో సందర్శకులకు షాపింగ్, నెట్‌వర్కింగ్ అవకాశాలు కల్పించనున్నారు. తెలుగు జాతి ఐక్యతను ప్రపంచానికి చాటిచెప్పే ఈ మహాసభలు చిరస్మరణీయంగా నిలుస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.