అమెరికాలోని నెబ్రాస్కాలో తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) తొలిసారిగా నిర్వహించిన 5K రన్/వాక్ విజయవంతంగా ముగిసింది. ఉత్సాహం, ఆరోగ్యంపై అవగాహనతో పాటు సేవా భావాన్ని చాటుతూ ఈ కార్యక్రమం కమ్యూనిటీ వేడుకగా నిలిచింది.
ఈ 5Kలో చిన్నారులు, యువత, తల్లిదండ్రులు, కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉత్సాహంగా రన్/వాక్‌లో పాల్గొన్నారు. తొలిసారి నిర్వహించినప్పటికీ TSN బృందం ఎంతో కృషితో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
కార్యక్రమానికి ముందు యోగ ఇన్‌స్ట్రక్టర్ హైమవతి స్వచ్ఛందంగా యోగా, స్ట్రెచింగ్ సెషన్ నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు కలిసి యోగా, వ్యాయామాల్లో పాల్గొని 5Kకి సిద్ధమయ్యారు.
ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడంతో పాటు సేవా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా TSN తెలిపింది. స్థానికంగా Completely KIDS సంస్థకు మద్దతు అందించడంతో పాటు, గ్రామీణ భారతదేశంలోని వివిధ సేవా కార్యక్రమాలకు కూడా తమ వంతు సహకారం అందించనున్నట్లు పేర్కొంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క పాల్గొనేవారికి, వాలంటీర్లకు, స్పాన్సర్లకు, దాతలకు, కమ్యూనిటీ సభ్యులకు TSN ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని.. భవిష్యత్తులో మరింత మంది కమ్యూనిటీ సభ్యులు ముందుకు వచ్చి వాలంటీర్‌గా సేవలందించాలని, తమ ఆలోచనలు, సహకారంతో ఈ 5Kను మరింత పెద్ద కమ్యూనిటీ సంప్రదాయంగా తీర్చిదిద్దాలని TSN ఆకాంక్షించింది.




















