అమెరికా నేలపై మరోసారి తెలంగాణ సంస్కృతి ఘనంగా మార్మోగింది. నార్త్ కరోలినాలోని చార్లెట్ కన్వెన్షన్ సెంటర్ ఒక్కసారిగా తెలంగాణ పల్లె వాతావరణాన్ని తలపించింది. మూడు రోజుల పాటు జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 తొలి రోజు... ఆధ్యాత్మికత, సంస్కృతి, సంగీతం, సేవా స్ఫూర్తి, సెలబ్రేషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది.
సప్త సముద్రాలు దాటినా... తెలుగుదనం మాత్రం మారదు. ఈ సందేశంతో ప్రారంభమైన కార్యక్రమంలో అమెరికా నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కుటుంబాలకు టీటీఏ ఘన స్వాగతం పలికింది. చార్లెట్ నగరంలో ఈ మహా వేడుకను విజయవంతం చేయడానికి నెలల తరబడి శ్రమించిన వాలంటీర్లు, నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు వెల్లువెత్తాయి. టీటీఏ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మలిపెద్ది మాట్లాడుతూ... "తెలుగు సంస్కృతిని భావితరాలకు అందించడమే మా లక్ష్యం" అని స్పష్టం చేశారు.
ఫస్ట్ డేలో అసలు హైలైట్ అంటే 'జానపదాల జాతర'. స్టేజ్‌పై ఒక్కో పాట మొదలైతే... ప్రేక్షకులంతా లేచి డ్యాన్స్ చేసే స్థాయిలో ఉత్సాహం కనిపించింది.
రసమయి బాలకిషన్, వందేమాతరం శ్రీనివాస్, సంధ్య, నర్సిరెడ్డి కాసాలా, నల్గొండ గద్దర్, కాసర్ల శ్యామ్ కలిసి తెలంగాణ జానపదాన్ని అమెరికా గడ్డపై ప్రత్యక్షంగా ఆవిష్కరించారు.
"చిన్ని చిన్ని ఆశలన్నీ...", "తెలంగాణ గట్టు మీద...", "గున్నా గున్నా మామిడి..." వంటి పాటలకు సభ అంతా చప్పట్లతో, కేరింతలతో మార్మోగిపోయింది. ఒక దశలో కన్వెన్షన్ హాల్ కంటే... తెలంగాణ జాతరలో ఉన్న అనుభూతి ప్రేక్షకులకు కలిగింది.
టీటీఏ ఈసారి కేవలం వినోదానికే పరిమితం కాలేదు. వైద్యం, విజ్ఞానం, జర్నలిజం, ఐటీ, కమ్యూనిటీ సర్వీస్, సాహిత్యం వంటి విభిన్న రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు ప్రతిష్టాత్మక అవార్డులు అందజేసి గౌరవించింది.
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ నుంచి యూత్ అచీవ్‌మెంట్ వరకు వివిధ విభాగాల్లో అవార్డులు అందుకున్న ప్రముఖులను సభికులు నిలబడి అభినందించారు. "ప్రతిభకు దేశ సరిహద్దులు లేవు" అనే సందేశాన్ని ఈ అవార్డులు మరోసారి చాటిచెప్పాయి.
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ... అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ మూలాలను మరచిపోకుండా, పిల్లలకు భాష, సంస్కృతి, సంప్రదాయాలను నేర్పిస్తున్న తీరు అభినందనీయమని అన్నారు. రాబోయే భారత భవిష్యత్తులో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
టీటీఏ డిజిటల్ సావనీర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. సంస్థ సేవా కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను సభ్యులు వివరించారు.
ఇక స్టేజ్‌పైకి యాంకర్ సుమ కనకాల రాగానే... సభలో వాతావరణమే మారిపోయింది. ఆమె చమత్కారాలు, బిగ్‌బాస్ ప్రస్తావనతో జరిగిన సరదా సంభాషణలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి.
టీటీఏ మెగా కన్వెన్షన్ తొలి రోజు ఒక విషయం స్పష్టంగా చెప్పింది... తెలుగు ఎక్కడ ఉన్నా... తెలంగాణ గుండె చప్పుడు అక్కడే ఉంటుంది. సంస్కృతి, సేవ, స్నేహం, సెలబ్రేషన్... ఈ నాలుగు విలువలను ఒకే వేదికపై అద్భుతంగా చూపించిన టీటీఏ తొలి రోజు వేడుకలు అమెరికాలోని తెలుగు సమాజానికి చిరస్మరణీయంగా నిలిచాయి. ఇప్పుడు అందరి చూపు... రెండో రోజు స్టార్ ఆకర్షణలు, గ్రాండ్ కార్యక్రమాలపైనే ఉంది!













