టీటీఏ మెగా కన్వెన్షన్‌లో దేవిశ్రీ ప్రసాద్ సందడి.. ‘ఎల్లమ్మ’ మూవీ ఎక్స్‌క్లూజివ్ సాంగ్ లాంచ్ అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జూలై 17 నుంచి 19, 2026 వరకు తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (టీటీఏ) ఆధ్వర్యంలో మెగా కన్వెన్షన్ అత్యంత వైభవంగా జరగనుంది. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు ప్రజలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వైద్యులు, సినీ, సాంస్కృతిక రంగాలకు చెందిన అతిథులు ఈ మహాసభలకు హాజరుకానున్నారు.
మూడు రోజుల పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వ్యాపార, విద్యా, వినోద కార్యక్రమాలతో ఈ కన్వెన్షన్ సందడి చేయనుంది. ఈసారి మహాసభల్లో టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సందడి చేయనున్నారు. సినీ అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగించేలా దేవిశ్రీ ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రానికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సాంగ్‌ను ఈ వేదికపైనే ఆవిష్కరించనున్నారు. సాంగ్ లాంచ్‌తో పాటు ప్రత్యేక డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కూడా హాజరుకానున్నారు.
సినీ సంగీతం, ప్రత్యక్ష ప్రదర్శనలు, ప్రముఖుల పాల్గొనడం వంటి విశేషాలతో టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 తెలుగు ప్రజలకు వినోదంతో పాటు సాంస్కృతిక వైభవాన్ని అందించే మహోత్సవంగా నిలవనుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని తెలుగు సంఘాల చరిత్రలో మరో ప్రతిష్ఠాత్మక వేడుకగా ఈ కన్వెన్షన్ నిలవనుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి, శేఖర్ రెడ్డి , అడ్వైజరీ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఈ వేడుకను విజయవంతం చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.















