అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తూ ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో కన్వెన్షన్ మహాసభలు-2026 ఘనంగా ప్రారంభమయ్యాయి. జూన్ 19, 20 తేదీల్లో గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్‌లో జరుగుతున్న ఈ రెండు రోజుల మహాసభలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి.

మహాసభల తొలి రోజు నిర్వహించిన బ్యాంక్వెట్ నైట్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమెరికా నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది తెలుగు కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశాయి. సేవ, సంస్కృతి, సమానత్వం అనే విలువలను ప్రాతిపదికగా తీసుకుని పనిచేస్తున్న మాటా సంస్థ, ఈ మహాసభలను కూడా అదే స్ఫూర్తితో నిర్వహిస్తోంది.

ఈ కన్వెన్షన్‌కు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు జయప్రద హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, నటి ఐశ్వర్య రాజేష్, స్వాతి రెడ్డి, నటుడు అలీ, యాంకర్ సుమతో పాటు పలువురు సినీ, టెలివిజన్ ప్రముఖులు పాల్గొని ప్రేక్షకులను అలరించారు.

వినోద కార్యక్రమాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి, సుధాకర్ తమ హాస్య ప్రదర్శనలతో కడుపుబ్బ నవ్వించారు. ప్రముఖ మిమిక్రీ కళాకారులు శివారెడ్డి, రమేష్ వివిధ ప్రముఖుల గొంతులను అనుకరిస్తూ నవ్వుల వర్షం కురిపించారు.

సంగీత విభాగంలో సింగర్ రామ్ మిరియాల తన ప్రత్యేక లైవ్ కాన్సర్ట్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అలాగే సమీరా భారద్వాజ్, రీటా, రామచారి తదితర గాయకులు తమ మధుర గానంతో సభలో ఉత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రముఖులను మాటా వేదికపై ఘనంగా సన్మానించి సత్కరించారు. తెలుగు సమాజ అభివృద్ధికి, సామాజిక సేవలకు, విద్యా, సాంస్కృతిక రంగాలకు విశేష కృషి చేసిన వ్యక్తులను నిర్వాహకులు ప్రత్యేకంగా గుర్తించి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. సభలో పాల్గొన్న అతిథులు సన్మానితులను అభినందించగా, ప్రేక్షకులు హర్షధ్వానాలతో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సత్కార కార్యక్రమం మహాసభలకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మహాసభలు అమెరికాలోని తెలుగు సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. మన భావి తరాలు తెలుగు గొప్ప సంస్కృతీ సంప్రదాయాలను గర్వంగా ముందుకు తీసుకెళ్లేలా ఈ వేడుకలు స్ఫూర్తిని నింపుతున్నాయని వారు పేర్కొన్నారు.

రెండు రోజుల పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక, వినోద కార్యక్రమాలతో సాగనున్న మాటా కన్వెన్షన్-2026 తెలుగు వారందరికీ ఓ చిరస్మరణీయ వేడుకగా నిలవనుంది. అమెరికా గడ్డపై తెలుగు వెలుగులను మరింత ప్రకాశవంతం చేస్తూ ఈ మహాసభలు తెలుగు ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి.